TELANGANA

బీజేపీకి షాక్: హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన బాబు మోహన్ తనయుడు

హైదరాబాద్: అందోల్‌ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాబు మోహన్‌కు ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. బాబుమోహన్ కొడుకు ఉదయ్ బాబుతో పాటు జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ బీజేపీ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకూర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా సీఎం కేసీఆర్‌ హ్యాట్రిక్‌ సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అందోల్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఓసీ గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి హరీశ్ రావు. ఈ మేరకు సీఎం కేసీఆర్ మేనిఫెస్టోలో ప్రకటించారని చెప్పారు. సిద్దిపేటలో రాష్ట్ర గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

అరవై ఏళ్ల విపక్షాల పాలనలో తెలంగాణలో 268 గురుకులాలు ఉంటే, కేసీఆర్ ప్రభుత్వం వాటిని వెయ్యికి పెంచిందన్నారు. అంతకుముందు గురుకులాల్లో 1.90 లక్షలమంది చదివితే ఇప్పుడు ఆరు లక్షలమంది చదువుతున్నారన్నారు. పిల్లలకు మంచి చదువు, నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేశామని రాష్ర్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉంటామని ముందుకొచ్చినందుకు అసోషియేషన్ సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

తెలంగాణ ఏర్పడకముందే బీడు భూములు కనిపించేవని, తర్వాత కాలువలతో సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేశామని మంత్రి తెలిపారు. గతంలో పంటలు పండక రైతుల ఆత్మహత్యలు ఉండేవని.. ఇప్పుడు నాణ్యమైన విద్యుత్, డ్రిప్, వ్యవసాయ పనిముట్లు, రైతు బంధు, రైతు బీమా వంటి సదుపాయాలతో ఆ పరిస్థితులు లేకుండా పోయాయని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్న కర్ణాటకలో రోజూ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు.

కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత గురుకులాలల్లో విద్యను ఇంటర్ వరకు పెంచారని, విద్యార్థులకు ఎంసెట్‌, నీట్‌లో నాణ్యమైన శిక్షణ ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు గురుకులాల్లో చదివిన 6,652 మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అయ్యారని తెలిపారు. భవిష్యత్‌లో గురుకులాలను డిగ్రీ వరకు పెంచే కృషి జరుగుతోందన్నారు. అంతేగాక విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే వారికి రూ.20 లక్షలు ఇస్తున్నామని మంత్రి హరీశ్ రావు వివరించారు. బిడ్డ తల్లి చేతుల్లో ఎంత భద్రంగా ఉంటదో, కేసీఆర్‌ చేతుల్లో తెలంగాణ అంత భద్రంగా ఉంటదని అన్నారు. బీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు.