NationalTELANGANA

కీలక హామీలు ప్రకటించిన అమిత్ షా..

ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో స్థానానికి చేరిందని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్‍‌పల్లి, కోరుట్ల, జనగామ జిల్లాలో ఆయన సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభల్లో అమిత్ షా ప్రసంగిస్తూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

 

Advertisement

వల్లభాయ్ పటేల్ కృషి వల్లే రజాకార్ల నుంచి తెలంగాణ విముక్తి పొందిందని అమిత్ షా గుర్తు చేశారు. ఓవైసీకి భయపడే కేసీఆర్ విమోచన దినోత్సవాలు జరపడం లేదని ఆయన ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాగానే విమోచన దినోత్సవాలను అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. బైరాన్‌పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపం నిర్మిస్తామని తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కుటుంబ పార్టీలన్న అమిత్ షా.. బీజేపీ ప్రజల పార్టీ అని చెప్పారు.

 

 

మోడీ హయాంలో దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. మోడీ కొత్త పార్లమెంట్ నిర్మించి దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం రాగానే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. అవినీతిలో కేసీఆర్ పాలన అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు.

 

కాళేశ్వరం, మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని అమిత్ షా ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధమైన 4 శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు. రాష్ట్రంలోని పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఫసల్ బీమా అమలు చేస్తామని చెప్పారు. పేదలకు వైద్యం కోసం 10 లక్షల వరకు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు.

 

మోడీ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు సరైన న్యాయం లభిస్తుందన్నారు అమిత్ షా. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఔటర్ రింగ్ రోడ్డు, మియాపూర్ భూ కుంభకోణానికి అవినీతికి పాల్పడ్డారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి నాయకులను జైలుకు పంపుతామన్నారు. రైతుల పంట బీమా సొమ్మును బీజేపీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. తమ ప్రభుత్వం వస్తే ఐదేళ్లలో 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు అమిత్ షా. తెలంగాణ ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.