TELANGANA

కేసీఆర్ ఈజ్ బ్యాక్…

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని ఎదుర్కొన్న భారత్ రాష్ట్ర సమితి.. లోక్‌సభ బరిపై దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాలను ఇక్కడ పునరావృతం కాకుండా చూసుకుంటోంది. అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోంది. రెండు- మూడు తప్ప అన్ని లోక్‌సభ నియోజకవర్గాలపైనా సమీక్షలు పూర్తి చేసింది.

 

అటు అధికార కాంగ్రెస్ పార్టీపై దాడికి సమాయాత్తమౌతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటి కోసం పోరుబాట పట్టబోతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్‌కు అల్టిమేటాన్ని జారీ చేసింది. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషిస్తామని, మెడలు వంచి హామీలను అమలు చేస్తామంటూ హెచ్చరించింది.

 

ఈ పరిస్థితుల్లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతోన్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన అసెంబ్లీ అడుగు పెట్టనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

 

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్.. తన కంచుకోట గజ్వేల్ నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 45 వేలకు పైగా ఓట్ల తేడాతో భారతీయ జనతా పార్టీకి చెందిన ఈటల రాజేందర్‌ను మట్టికరిపించారు. రెండో నియోజకవర్గంగా కామారెడ్డి నుంచి పోటీ చేశారు గానీ పరాజయాన్ని చవి చూశారు.

 

 

నడుముకు శస్త్ర చికిత్స చేయించుకున్న కేసీఆర్ మొన్నటి వరకు విశ్రాంతి తీసుకున్నారు. సర్జరీ వల్ల అప్పట్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదు. రెండు రోజుల కిందటే ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు. సుదీర్ఘ విరామం తరువాత రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు.

 

అదే నెల 14వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనితో- ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పాత్ర ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. రాష్ట్రం అవతరించిన అనంతరం కేసీఆర్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోబోతోండటం ఇదే తొలిసారి కావడం వల్ల అందరి దృష్టీ ఆయనపైనే నిలిచింది.