అయోధ్య రామమందిరంలో బాలక్ రామ్ విగ్రహ ప్రతిష్ట అనంతరం భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడి బాల రాముడికి అంకితమిస్తూ భక్తి సంగీత ఉత్సవం ప్రారంభమైంది. అయోధ్య గర్భగుడికి ఎదురుగా ఉన్న మండపంలో ఈ సంగీత ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సంగీత కార్యక్రమం మార్చి 10 వరకు అంటే 45 రోజులపాటు కొనసాగనుందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు వెల్లడించారు.
ఈ సంగీత ఉత్సవం శాస్త్రీయ సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలు, కళా సంప్రదాయాలకు చెందిన 100 మందికి పైగా ప్రసిద్ధ కళాకారులు పాల్గొనన్నారు. వీరంతా రాముడి పాదాల చెంత ‘రాగ సేవ’ కార్యక్రమాన్ని అందించనున్నారు. ఈ సంగీత ఉత్సవంలో వైజయంతిమాల, పద్మా సుబ్రహ్మణ్యం, హేమామాలిని, అనూప్ జలోటా, మాలిని అవస్థీ, సురేశ్ వాడ్కర్, అనురాధ పౌడ్వాల్, సోనాల్ మాన్‌సింగ్ వంటి ప్రముఖులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఇదే కాకుండా ఈ ఉత్సవంలో దేశం నలుమూలల నుంచి వచ్చిన 50 సంగీత వాయిద్యాలు మంగళ ధ్వనిలో భాగం కానున్నట్లు వివరించారు. ఈ వేడుకకు సమన్వయకర్తగా యతీంద్ర మిశ్ర వ్యవహరించనున్నారు. ఢిల్లీ సంగీత నాటక అకాడమి ఈ కార్యక్రమానికి సహకరించడం జరుగుతోంది.
గాన కచేరీని కూడా నిర్వహించనున్నారు… ఈ సంగీత ఉత్సవంలో మాలినీ అవస్థీ ‘సోహర్’, ‘బధవ’, ‘మంగళ్ గాన్’ వంటివి ఆలపించడం జరుగుతుంది. బసంతి బిష్త్, ప్రేరణ శ్రీమాలి, సునంద శర్మ, మీటా పండిత్, పద్మా సుబ్రహ్మణ్యం కూడా గాన కచేరి చేయనున్నారు. అయోధ్య రామమందిరంలో బాలక్ రామ్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవంలో ప్రతిధ్వనించిన ‘మంగళ్ ధ్వని’కి యతీంద్ర మిశ్రా ఆధ్వర్యం వహించడం జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఏభై సాంప్రదాయక సంగీత పరికరాలను ఆ కార్యక్రమంలో ఉపయోగించారు. ‘మంగళ్ ధ్వని’కి ముందు సోనూ నిగమ్, అనూరాధ పౌడ్వాల్, శంకర్ మహదేవన్ శ్రీరాముని స్తుత్తిస్తూ పాటలు పాడడం జరిగింది.