TELANGANA

‘హైదరాబాద్ వచ్చాను.. ఇంటికి రా మామ’ మెసేజ్‌తో పట్టుబడిన పైరసీ కింగ్‌పిన్ ‘ఐబొమ్మ రవి’

తెలుగు సినీ పైరసీలో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ రవి’ (ఇమంది రవి)ని సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేశారు. ఆరేళ్లలో కోట్ల రూపాయల అక్రమ సంపదను కూడబెట్టి, దేశ విదేశాల్లో ఏజెంట్లను, సర్వర్లను ఉపయోగించి పైరసీ సామ్రాజ్యాన్ని నడిపిన రవి, తనను పట్టుకోవడం పోలీసులకు అసాధ్యమని సవాల్ విసిరాడు. అయితే, పోలీసులు సుమారు మూడు నెలల పాటు అత్యంత గోప్యంగా నిఘా పెట్టి, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు ఒక కీలకమైన ఈ-మెయిల్ లింక్ ఆధారంగా నిందితుడి ఆచూకీని పసిగట్టారు. రవి ‘ఈఆర్ ఇన్ఫోటెక్’ అనే కంపెనీ పేరుతో డొమైన్‌లను కొనుగోలు చేయగా, డొమైన్ రిజిస్ట్రేషన్ల ద్వారా లభించిన ఫోన్ నంబరు ఆధారంగా రవి హైదరాబాద్‌లో ఉన్న తన అత్యంత సన్నిహితుడైన మిత్రుడిని గుర్తించారు. ఆ మిత్రుడి ఫోన్ నంబర్‌పై రహస్యంగా నిఘా పెట్టిన పోలీసులు, రవి హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా తమకు సమాచారం అందేలా ఏర్పాటు చేసుకున్నారు.

పోలీసుల వేట ఫలించింది. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఉన్న తన నివాసానికి చేరుకున్న రవి, తన మిత్రుడికి ‘మామా హైదరాబాద్ వచ్చా… ఇంటికి రా మామ’ అనే ఒకే ఒక్క మెసేజ్ పంపాడు. ఈ మెసేజ్ ఆధారంగా రవి నగరంలో ఉన్నట్లు కచ్చితంగా నిర్ధారించుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు, క్షణం ఆలస్యం చేయకుండా కూకట్‌పల్లిలోని నివాసానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం రవిని ఐదు రోజుల కస్టడీకి తీసుకుని లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు.