National

పార్లమెంట్ డ్రామా కాదు, చర్చా వేదిక: ప్రధాని వ్యాఖ్యలకు ప్రియాంకాగాంధీ ఘాటు కౌంటర్

ప్రధాని నరేంద్ర మోదీ చట్టసభల్లో ‘డ్రామాలు ఆడవద్దు’ అంటూ విసిరిన వ్యంగ్యాస్త్రాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా ఘాటుగా స్పందించారు. సమావేశాల్లో భాగంగా ఎన్నికల నిర్వహణలో అవకతవకలు, ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఢిల్లీ కాలుష్యం వంటి తీవ్రమైన అంశాలను లేవనెత్తడం డ్రామా ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. సీరియస్‌ అంశాలపై చర్చ లేకపోతే పార్లమెంట్ దేనికి? అని ఆమె ప్రశ్నించారు.

ఆయా అంశాలపై మాట్లాడటమేమీ డ్రామా కాదని, ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య చర్చలకు అనుమతించకపోవడమే నిజమైన డ్రామా అని ప్రియాంకాగాంధీ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అవసరాన్ని ఆమె బలంగా నొక్కి చెప్పారు. అదేవిధంగా, పార్లమెంట్ వేదికగా ప్రజా సమస్యలపై చర్చించడానికి బదులు ప్రధాని మోదీ మరోసారి నాటకీయ ప్రసంగం చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందని, ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని మల్లికార్జున ఖర్గే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడిన తర్వాత, కాంగ్రెస్ నేతలు ఈ విధంగా స్పందించి తమ అసంతృప్తిని తెలియజేశారు.