NationalTELANGANA

బీఆర్‌ఎస్‌లో అసమ్మతి రాజేసిన మైనంపల్లి!

బీఆర్‌ఎస్‌లో కొన్ని రోజులుగా చాపకింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి తిరుమల వేదికగా సోమవారం బ్లాస్ట్‌ అయింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దీనిని బ్లాస్ట్‌ చేశారు.

ఆయన బ్లాస్ట్‌ చేసింది.. టార్గెట్‌ చేసింది కూడా సాదాసీదా నేత కాదు. స్వయానా బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి మేనల్లుడు, రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావునే.

సిద్ధిపేటను భార్యలా.. మెదక్‌ను కీప్‌లా..
తిరుమల దైవదర్శనానికి వెళ్లిన మైనంపల్లి హన్మంతరావు తెలంగాణలో రాజకీయాలపై మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు పెత్తనం ఎక్కువైందన్నారు. సిద్దిపేటను తన భార్యలా, మెదక్‌ను తన కీప్‌లా చూసుకుంటున్నారని ఆరోపించారు. సిద్ధిపేటను అభివృద్ధి చేసుకుంటూనే మెదక్‌పై తన పట్టు ఉండేలా చూసుకుంటున్నారన్నారు.

రబ్బరు చెప్పులు, ట్రంక్‌ డబ్బాతో..
హరీశ్‌రావు వెలమ అయినా.. రబ్బరు చెప్పులు, ట్రంక్‌ డబ్బాతో వెలమ హాస్టల్‌కు వచ్చారని తెలిపారు. ఇప్పుడు ఏస్థాయికి ఎదిగాడో, ఎవరి చలవతో ఎదిగాడో గుర్తించాలన్నారు. డబ్బులు, పలుకుబడి ఉన్నాయని పార్టీలో పెత్తనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. రాజకీయంగా ఎంతో మందిని అణచి వేశాడని తెలిపారు. హరీశ్‌రావు అక్రమంగా రూ. లక్ష కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు.

బట్టలు ఇప్పుతా..
త్వరలోనే మంత్రి హరీశ్‌రావు బట్టలు విప్పుతానని మైనంపల్లి హెచ్చరించారు. తాను అవసరమైతే సిద్దిపేటలోనే పోటీ చేసి హరీశ్‌ రావు అడ్రస్‌ లేకుండా చేస్తాననన్నారు. మెదక్‌ సెగ్మెంట్‌ నుంచి తన కుమారుడు డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌ పోటీ చేస్తారని స్పష్టం చేశారు. హరీశ్‌రావును ఓడించడమే తన లక్ష్యమని వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేశారు. హనుమంతరావు తలచుకుంటే ఏం జరుగుతుందో మంత్రి హరీశ్‌ రావును చూపిస్తానంటూ శపథం చేశారు. సిద్దిపేటలో తన సత్తా ఏంటో చూపిస్తానంటూ ఘాటుగా స్పందించారు.

టికెట్‌ రాకుంటే స్వతంత్రంగా పోటీ..
ఇక వచ్చే ఎన్నికల్లో తనకు, తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ను కోరామన్నారు. కరోనా సమయంలో తన కుమారుడు రోహిత్‌రావు మెదక్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేశాడని తెలిపారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇవ్వకుంటే.. స్వతంత్రంగా పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.