National

బీహార్‌లో నితీష్ కుమార్‌కు కొత్త సవాళ్లు: చేజారిన హోం శాఖ.. బీజేపీ చేతిలో ‘రిమోట్ కంట్రోల్’ భయం!

బీహార్‌లో వరుసగా పదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్ రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం జేడీయూ (12 ఎంపీలు), టీడీపీ (16 ఎంపీలు) వంటి మిత్రుల మద్దతుతో నడుస్తున్న నేపథ్యంలో, బీహార్‌లో నితీష్‌ను ఇబ్బంది పెడితే కేంద్రంలోని ఎన్డీయే కూటమిపై ప్రభావం పడుతుందనే అంచనాతో బీజేపీ ఆచి తూచి వ్యవహరించింది. ఈ ఎన్నికల్లో జేడీయూ (85 సీట్లు) కంటే బీజేపీ (89 సీట్లు) నాలుగు సీట్లు ఎక్కువ గెలుచుకున్నప్పటికీ, సీఎం పీఠాన్ని నితీష్‌కే అప్పగించింది. అయితే, తన పాలనపై పూర్తి పట్టు సాధించేలా బీజేపీ వ్యూహం పన్నింది.

ముఖ్యమంత్రి పీఠాన్ని నిలుపుకున్నప్పటికీ, దాదాపు రెండు దశాబ్దాలుగా తన వద్దే ఉన్న అత్యంత కీలకమైన హోం శాఖను నితీష్ కుమార్ తొలిసారిగా బీజేపీ నేత మరియు ఉపముఖ్యమంత్రి అయిన సామ్రాట్ చౌదరికి అప్పగించాల్సి వచ్చింది. అంతేకాదు, మరో ఉపముఖ్యమంత్రి విజయ్ సిన్హాకు రెవెన్యూ, భూగర్భ శాఖలను కేటాయించడంతో పాటు, ఇతర కీలక మంత్రిత్వశాఖలను కూడా బీజేపీ తన వశం చేసుకుంది. హోం శాఖ బీజేపీ చేతుల్లోకి వెళ్లడంతో, రాష్ట్ర పాలన రిమోట్ కంట్రోల్ బీజేపీ చేతుల్లోకి వెళ్లినట్లైంది.

ఈ పరిణామాల నేపథ్యంలో, పేరుకు నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పటికీ, రాష్ట్రంలో ప్రధాన నిర్ణయాలన్నీ బీజేపీ ద్వారానే జరిగిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నితీష్ ముఖ్యమంత్రి పదవి కూడా ‘దినదిన గండం’గా ఉండబోయే పరిస్థితి నెలకొంది. కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత బీహార్‌లో సీఎంను మార్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, గరిష్టంగా మూడేళ్ల పాటు మాత్రమే నితీష్ ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.