లోక్‌సభ ఎన్నికలకు 57 మంది అభ్యర్థులతో కూడిన మూడు జాబితాను గురువారం రాత్రి విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. వీరిలో నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి, పెద్దపల్లి అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ, సికింద్రాబాద్ అభ్యర్థిగా దానం నాగేందర్, మల్కాజిగిరి అభ్యర్థిగా సునీతా మహేందర్‌రెడ్డి, చేవెళ్ల అభ్యర్థిగా గడ్డం రంజిత్‌రెడ్డిలను ఏఐసీసీ ఎంపిక చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరిలోని పలు స్థానాలకు తాజా జాబితాలో అభ్యర్థులను ప్రకటించారు. పశ్చిమబెంగాల్‌లోని బహరాంపూర్ నుంచి అధీర్ రంజన్ చౌదరీ బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అల్లుడు రాధాకృష్ణ కర్ణాటకలోని గుల్బార్గా నుంచి, కేంద్రమంత్రి మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణితి షిండే మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి పోటీ చేయనున్నారు.
తాజా జాబితాతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మొత్తం 139 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా, తొలి జాబితాలో మహబూబ్‌నగర్ నుంచి ఏఐసీసీ కార్యదర్శి, సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నల్గొండ నుంచి కుందూరు రఘువీర్‌రెడ్డి, మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
ఇంకా ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా, వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఖమ్మం నుంచి ఉపముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండగా ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్న వీహెచ్పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లు తెలుస్తోంది.
ఇక, కరీంనగర్ నుంచి ఏఐసీసీ హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడి నుంచి వెలిచల రాజేంద్రరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి టికెట్ ఆశిస్తుండగా.. తమకు అవకాశం కల్పించాలని మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, ఆరంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్‌రెడ్డి పట్టుబడుతున్నట్లు సమాచారం.