TELANGANA

నేడు సుప్రీంకోర్టులో ఈడీ అరెస్ట్ పై కవిత పిటీషన్ విచారణ.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తన అరెస్టును సవాలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్ కు సంబంధించి నేడు విచారణ జరగనుంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఒకదాని తర్వాత ఒకటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

 

ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయ్యి గత ఐదు రోజులుగా ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత, ఈ కేసు నుండి తనకు ఊరట కలిగించడానికి సుప్రీం ధర్మాసనాన్ని నమ్ముకున్నారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని, ఈడి నిబంధనలను ఉల్లంఘించి తనను అరెస్టు చేసిందని, ట్రాన్సిట్ రిమాండ్ వారెంట్ లేకుండానే తనను అరెస్టు చేసిందని, కవిత పిటిషన్ లో పేర్కొన్నారు.

 

ఈ కేసులో ఉన్న పలువురు నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా తనను అరెస్టు చేసినట్టుగా పేర్కొన్న కవిత, గతంలో తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై తుది తీర్పు ఇంకా రాకుండా తనను అరెస్టు చేసినట్టు, ఈడీ చర్యలు చట్ట విరుద్ధం అంటూ, తన అరెస్టును, రిమాండ్ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ సుప్రీం ధర్మాసనం ముందు పిటిషన్ పెట్టారు.

 

నేడు ఈ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం విచారించనుంది. జస్టిస్ సంజీవ్ కన్నా, ఎంఎం సుంద్రేష్ , బీఎం త్రివేదీ లతో కూడిన ధర్మాసనం నేడు ఈ కేసును విచారణ జరపనుంది. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు కోర్టులో కవిత పిటిషన్ పై వాదోపవాదాలు కొనసాగనున్నాయి.

 

అయితే ఇప్పటికే కవిత రౌస్ అవెన్యూ కోర్టులో తన అరెస్ట్ అక్రమం అంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేయడంతో అక్కడ ఆమెకు చుక్కెదురైంది. ఈడీ అరెస్టు సక్రమమేనని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పి ఎం ఎల్ ఏ చట్టంలోని సెక్షన్ 19ను పాటించారని రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్ పాల్, ఆమె పిటీషన్ ను కొట్టివేసి తీర్పు ఇచ్చారు.

 

ఇక నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో కవితకు ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడి అరెస్టు నుండి ఊరట లభిస్తుందా .. లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠను రేకెత్తిస్తుంది. రౌస్ అవెన్యూ కోర్టులో వచ్చిన తీర్పే మళ్ళీ వచ్చే అవకాశం లేకపోలేదు అన్న చర్చ జరుగుతుంది.