ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోనే టాప్ 5 రాజధానుల్లో ఒకటిగా నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో, అమరావతిని గ్లోబల్ రాజధానిగా తీర్చిదిద్దడంలో భాగంగా 2,500 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ విషయాన్ని మంత్రి నారాయణ పల్నాడు జిల్లా యండ్రాయిలో రైతులతో సమావేశమైన సందర్భంగా వెల్లడించారు. ఈ భారీ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు ద్వారా ఆ ప్రాంతం దశ తిరగనుందని భావిస్తున్నారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు చేపట్టిన రెండో విడత ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ విడతలో రైతులు అందించే 7 వేలకు పైగా ఎకరాల భూముల్లో, సుమారు 2,500 ఎకరాలలో ఈ అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగనుంది. భూసేకరణ వల్ల రైతులు నష్టపోతారనే ఉద్దేశంతోనే ల్యాండ్ పూలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా, నంబూరి బలరాం అనే రైతు ఏకంగా 4 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌కు అప్పగించి ప్రభుత్వానికి సహకరించారు.
గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం, న్యాయపరమైన చిక్కుల కారణంగానే రాజధాని నిర్మాణం ఆలస్యమైందని మంత్రి నారాయణ విమర్శించారు. అయితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు వేగవంతం అయ్యాయని స్పష్టం చేశారు. రైతుల ప్లాట్లలో అభివృద్ధి పనులను త్వరగా చేపడతామని, ఇందులో భాగంగా ట్రంకు రోడ్లు, 4 లైన్ల రోడ్లు, ఆరు లైన్ల ప్రధాన రహదారులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు.

