జగిత్యాల జిల్లా మెట్పల్లి-కోరుట్ల జాతీయ రహదారిపై పెద్దగుండు ప్రాంతంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకుని కారులో తిరిగి వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వారి కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
మృతులను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంథని గ్రామానికి చెందిన కోటగిరి మోహన్, ఆయన భార్య లావణ్యగా గుర్తించారు. వీరి కుమార్తె కీర్తి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంతో మంథని గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
అదేవిధంగా తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కంది వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ నుంచి పటాన్చెరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్ను వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.

