TELANGANA

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఆరు నెలలే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం గా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇన్నాళ్లు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన బీజేపీ.. తాజాగా వ్యూహం మార్చింది. ఆ పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం, కాంగ్రెస్ కు ఓటేస్తే అధికారంలోకి వచ్చేది కేసీఆర్ అని ప్రకటించడం రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చకు కారణమైంది. అంతేకాకుండా మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ నుంచి రూ. 25 కోట్లు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు చేసిందని ఆరోపించారు. స్పందించిన రేవంత్.. ఈటలకు సవాల్.. రాజేందర్ ఆరోపణలపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
ఈటల రాజేందర్ కు చాలెంజ్ చేయడంతో దీంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలతో రేవంత్ రెడ్డి దానికి సమాధానంగా ఈటల రాజేందర్ బీజేపీకి ఇష్టమైన భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర తడిబట్టలతో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసిరారు. దీంతో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య తాజా పరిణామాలతో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతుంది. బీఆర్ఎస్ ను సైడ్ చేసే వ్యూహం.. పదే పదే అధికార బీఆర్ఎస్ ను విమర్శించడం ద్వారా.. ఆ పార్టీ కి అనవసర ప్రాధాన్యం ఇస్తున్నామని.. ఆ పార్టీ తెలంగాణాలో ఇంకా బలంగా ఉంది అన్న సంకేతం ప్రజల్లోకి వెళ్తోంది అని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అధికార పార్టీనీ సైడ్ చేయాలని ప్లాన్ చేశారు. అందులో భాగమే ఈటెల రాజేందర్ ఆరోపణలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ను పక్కకు నెట్టేసి రెండు పార్టీలు ఈ విషయాన్ని హైలెట్ చేసుకోవడం కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నట్టు చర్చ జరుగుతుంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పేరు రాకుండా బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగానే కొత్త అంశం తెర మీదకు తీసుకువచ్చి రాజకీయాలను మారుస్తున్నారన్న చర్చ జరుగుతుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితులు మారితే, జనాలకు కూడా ఈ రెండు పార్టీల పైన దృష్టి పడుతుందని భావిస్తున్నట్టు సమాచారం.