National

వైద్యరంగం తలదించుకునే ఘోరం: కడుపులో కత్తెరకు మహిళ బలి.. 18 నెలల నరకం తర్వాత విషాదాంతం!

వైద్యం చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. బీహార్‌లోని మోతిహారీ జిల్లాలో వెలుగుచూసిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 18 నెలల క్రితం ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లిన ఉషాదేవి (25) అనే మహిళకు వైద్యులు సిజేరియన్ చేశారు. ఆ సమయంలో శస్త్రచికిత్సకు వాడిన 12 సెంటీమీటర్ల పొడవైన కత్తెరను పొరపాటున ఆమె కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు. ఆ అజాగ్రత్తే ఆ తల్లి పాలిట కాలపాశంగా మారింది.

ఆపరేషన్ జరిగినప్పటి నుండి ఉషాదేవి విపరీతమైన కడుపు నొప్పితో నరకం అనుభవించింది. అనేక ఆసుపత్రులు తిరిగినా వైద్యులు కేవలం పెయిన్ కిల్లర్లు ఇచ్చి పంపించారే తప్ప, లోపల ఉన్న అసలు సమస్యను గుర్తించలేదు. ఇటీవల నొప్పి భరించలేనంత స్థాయికి చేరడంతో మరో ఆసుపత్రిలో సిటీ స్కాన్ చేయించగా, కడుపులో కత్తెర ఉన్నట్లు తేలింది. ఈ షాకింగ్ దృశ్యం చూసి కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. పరిస్థితి విషమించడంతో వెంటనే మరో శస్త్రచికిత్స నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది.

కడుపులో ఉన్న కత్తెర కారణంగా ఉషాదేవి పేగులు తీవ్రంగా దెబ్బతిని, లోపల ఇన్ఫెక్షన్ పూర్తిగా వ్యాపించింది. రెహమానియా మెడికల్ సెంటర్‌లో ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఒక చిన్నారిని తల్లికి దూరం చేసిన సదరు వైద్యురాలిపై హత్య కేసు నమోదు చేయాలని బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి ఇంతటి ఘోర తప్పిదానికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.