జనగామలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేవలం ఒక ప్రెస్ మీట్ పెడితేనే కాంగ్రెస్ ప్రభుత్వం వణికిపోయిందని, ఆయన గనుక అసెంబ్లీలోకి అడుగుపెడితే రేవంత్ రెడ్డి తట్టుకోలేరని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ‘మొనగాడు’ కేసీఆర్ అని, ఆయన సత్తా ఏంటో అసెంబ్లీలో చూపిస్తారని కేటీఆర్ హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘420 హామీల’ను నమ్మి ప్రజలు ఓటేశారని, కానీ అధికారంలోకి వచ్చాక రైతులను నట్టేట ముంచారని కేటీఆర్ మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు చెప్పారని ఆరోపిస్తూ, రైతులను మోసం చేసినందుకు ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రవర్తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారాయి. రేవంత్ రెడ్డి నిత్యం ఇతరులపై అరుస్తూ, కరుస్తాడనే భయం కలిగిస్తున్నారని.. ఆయనను అదుపులో ఉంచాలని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై ఇలాంటి వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వారు హితవు పలుకుతున్నారు.

