- సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడు యోగి వేమన*
- రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ
- ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం :- జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్
గాండ్లపెంట(కటారుపల్లి), జనవరి 19:
విశ్వ కవి, ప్రజాకవి యోగి వేమన తన పద్యాల ద్వారా సత్యం, సమానత్వం, మానవత్వం వంటి విలువలను సమాజానికి అందించారు. కుల, మత భేదాలకు అతీతంగా సామాజిక సామరస్యాన్ని నెలకొల్పడమే వేమన బోధనల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు సవితమ్మ తెలిపారు.
కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం కటారుపల్లి గ్రామంలో… సోమవారం కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా, పండుగ వాతావరణంలో కన్నుల పండువగా విశ్వకవి, ప్రజాకవి యోగివేమన రాష్ట్రస్థాయి జయంతోత్సవాలు 2026 ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గొల్లపల్లి నుంచి కటారుపల్లి యోగివేమన స్మారక కేంద్రం వరకు సాంప్రదాయ చెక్కభజన బృంద కళాకారులు, డప్పు వాయిద్యాలు, “యోగివేమన పద్యాల” ప్లకార్డులతో వందలాది విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ వేడుకలలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్, ఎంపీ బీకే పార్థసారథి, శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ముఖ్య అతిథులందరూ యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… వేమన ప్రజాకవి, సంఘసంస్కర్త అని కొనియాడారు. విశ్వదాభిరామ వినురవేమ అంటూ వేమన రాసిన పద్యాలు తెలుగునాట ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. సామాన్యులకు అర్థమయ్యేలా తెలుగు వాడుక భాషలో పద్యాలు బోధిస్తూ, సామాజిక చైతన్యానికి వేమన ఎంతో కృషి చేశారన్నారు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు ఇలా ఒకటేమిటి కనిపించిన ప్రతి సమాజంలోని రుగ్మతులపైనా వేమన కలం ఝళిపించారన్నారు. వేమన కనుమూసిన కటారుపల్లి గ్రామంలోనే ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడం ఆనందకర విషయమన్నారు. వేమన సందేశాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
పర్యాటక హబ్ గా రాయలసీమ
చదువు లేనివాడు చచ్చినవాడు…చదువుకున్నవాడు సంజీవుడు…విశ్వదాభిరామ వినురవేమ…అని యోగి వేమన విద్య ప్రాముఖ్యతను ఆనాడే చెప్పారని మంత్రి సవిత గుర్తు చేశారు. వేమన బోధనలను ప్రాధాన్యమిస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్య వ్యవస్థ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళలు, కళాకారులకు ఎంతో ప్రాధాన్యమిస్తోందన్నారు. యోగి వేమన, శ్రీ సత్యసాయి బాబా, శ్రీకృష్ణదేవరాయుల రెండో రాజధాని పెనుకొండ.. ఇలా చారిత్రక ఆనవాళ్లతో రాయలసీమ ఎంతో ప్రఖ్యాతగాంచిందన్నారు. రాయలసీమ పర్యాటకంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి కోసం రూ.19 వేల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కూడా చేసుకుందన్నారు. రాయలసీమను పర్యాటక హబ్ గా మార్చడానికి సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ… ప్రజాకవి యోగివేమన బోధనలు సమాజానికి దిశానిర్దేశం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యోగివేమన జయంతోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిదన్నారు. తెలుగు భాషకు వన్నెతెచ్చిన కవిత్రయం లాంటి ఎందరో కవులు ఉన్నారు. అయితే సామాన్య పౌరులకు, పామరులకు కూడా సులువుగా అర్థమయ్యేలా తెలుగు భాషకు పద్యానికి వన్నెతెచ్చిన మహనీయుడు యోగివేమన”. వర్షంలో తడవని మనిషి ఉండడు… వేపన పద్యం తెలియని తెలుగు వారు ఉండరు అని నానుడి.” చిన్నచిన్న పదాలతో నిగూఢమైన భావం ఉండేలా వేమన పద్యాలు ఉంటాయి. వేమన ప్రజల విముక్తి కోసం పద్యాలు రాశాడు. సమాజంలోని మూఢనమ్మకాలు, అహంకారం, అసమానతలను ప్రశ్నిస్తూ
సూటిగా, ఘాటుగా, నిజాన్ని నిర్భయంగా చెప్పిన యదార్థవాది. సాధనమున పనులు సమకూరు ధరణిలోన అని వేమన చెప్పారు. అయితే కష్టపడి పని చేస్తారో వారికి అన్ని పనులు సమకూరుతాయని ఆనాడే ఆయన కష్టపడే తత్వాన్ని బోధించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి వేమన బోధనలను గుర్తుంచుకొని సమాజంలో ఉన్నతంగా ఎదగాలి. మన సత్యసాయి జిల్లాలో అనేక ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలు, పర్యావరణానికి అనుకూలమైన ప్రదేశాలు ఉన్నాయి. వీటన్నిటిని ఒక సర్క్యూట్ గా ఏర్పాటు చేసి పర్యాటక అభివృద్ధికి ప్రణాళిక మేరకు ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. యోగివేమన జీవ సమాధి పొందిన కటారిపల్లి గ్రామంలో ఈ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇందుకు కృషి చేసిన ఎమ్మెల్యే మరియు ఇతరులు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ… సమాజంలో సామాజిక, ఆధ్యాత్మిక, మూఢాచారాలు, కుల మతాలకు అతీతంగా పామరులకు సైతం అర్థమయ్యేలా చైతన్యం కలిగిస్తూ తన పద్యాలతో విశ్వకవిగా మహనీయుడు యోగివేమన. ఇతను ఒక వర్గానికి చెందిన వాడిగా కాకుండా… భోగి నుండి యోగిగా మారి ప్రజాకవిగా స్ఫూర్తిదాయకమైన వెలుతురు ఇచ్చిన వాడిగా అందరి మన్ననలను అందుకున్నారు. సత్యసాయి జిల్లాలో ఉన్న ప్రాంతాలన్ని ఒక టూరిజం సర్క్యూట్ గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా గొప్ప సంకల్పంతో ఉన్నారు.. ఆ దిశగా కృషి చేయడం జరుగుతుందని చెప్పారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ… శతాబ్దాల క్రిందటే సామాజిక రుగ్మతలను అర్థం చేసుకొని.. తన చిన్న పద్యాలతో ప్రజా చైతన్యం తీసుకువచ్చిన మహనీయుడు యోగివేమన అన్నారు. మూఢనమ్మకాలను సూటిగా ప్రశ్నించేలా… అక్షరాలనే సరాలుగా మార్చి.. సామాన్యుని భాషలో సూటిగా స్పష్టంగా చెప్పిన ప్రజాకవి అని పేర్కొన్నారు. వేమన చూపిన మార్గంలో పయనించి సమాజ నిర్మాణానికి మనమందరం దోహదపడేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ… నేటి ఆర్టిఫిషియల్ యుగంలో కూడా 17వ శతాబ్దిలో పాడిన ఒక మహనీయుని స్మరించుకుంటున్నామంటే యోగివేమన ఎంత గొప్ప ప్రజాకవో మనమందరము గుర్తుంచుకోవాలన్నారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపడానికి చిన్న చిన్న పదాలతో సమాజ చైతన్యాన్ని కలిగించిన విశ్వ కవి ప్రజా కవి యోగివేమన. ఈ ప్రాంతాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి తన సాయి శక్తుల కృషి చేస్తామన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అందరి పండుగలను రాష్ట్ర పండుగలుగా జరుపుతున్న మన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ ప్రాంతం, నియోజకవర్గానికి మంచి చేయడానికి అలాగే కటారుపల్లె ,గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తిమ్మమ్మ మర్రిమాను , శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ దేవాలయం , పాలపాటిదిన్నె అంజనేయస్వామి ఆలయంను, ప్రశాంతినిలయం , లేపాక్షి ని అనుసంధానం చేసి అన్నింటినీ కలుపుతూ ఇక్కడ ఒక టూరిజం హబ్ ఏర్పాటుకు రూ.6.30 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరుగుతుందన్నారు. యోగి వేమనకు ప్రాచుర్యం కల్పిస్తూ.. ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నిర్మాణాత్మకంగా అడుగులు వేయడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారి పిలుపుమేరకు టెక్నాలజీని వినియోగించుకుని వేమన పద్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ పిల్లల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేలా ఏఐ యాప్ ని రూపొందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో కటారపల్లిని యోగివేమన మండలంగా ప్రకటించేలా కృషి చేయడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.
వేమన సమాధి వద్ద ప్రత్యేక నివాళులు
అంతకుముందు కటారుపల్లిలోని యోగి వేమన సమాధిని మంత్రి సవితమ్మ, ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎమ్మెల్యేలు కందికుంట వెంకటప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, కాలవ శ్రీనివాసులతో అనంతపురం జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తదితరులు వేమన సమాధి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఘన నివాళులర్పించారు.
ఏషియన్ బుక్ అఫ్ రికార్డు:-
సోమవారం కటారిపల్లిలో నిర్వహించిన విశ్వ కవి ప్రజా కవి యోగివేమన జయంతోత్సవాలు 2026 పురస్కరించుకొని.. నిర్వహించిన కార్యక్రమంలో ఓకే వేదిక నుంచి ఒకేసారి వేలాది మంది ఒకే ప్రాంతంలో ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో యోగివేమన పద్యాలు ఆలపించి రికార్డు సృష్టించారు. దీన్ని గుర్తిస్తూ ఏషియన్ బుక్ అఫ్ రికార్డులో యోగివేమనకు స్థానం కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించి ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ మరియు శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ కు అందజేశారు. ఏషియన్ బుక్ అఫ్ రికార్డు సాధించినందుకు ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తపరిచారు.
ఈ వేడుకలలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, డిఆర్డియే పీడీ, పర్యాటక శాఖ ఇంచార్జి అధికారి నరసయ్య, ఆర్డిఓ వివిఎస్ శర్మ, మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, తహసిల్దార్, ఎంపిడిఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, కళాకారులు, సాహితీ అభిమానులు, ప్రజలు అశేష సంఖ్యలో పాల్గొన్నారు..

