TELANGANA

తెలంగాణ పోలీసుల సంచలనం: ఇంటి నుంచే ఫిర్యాదు.. మొబైల్‌కే ఎఫ్‌ఐఆర్ కాపీ!

శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడించి తెలంగాణ పోలీస్ శాఖ మరో చారిత్రాత్మక ముందడుగు వేసింది. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగే పనిలేకుండా, నేరుగా వారి ఇంటి వద్దే ఫిర్యాదులు స్వీకరించేలా ‘సీ-మిత్ర’ (C-Mitra) అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు మరియు శారీరక ఇబ్బందులతో స్టేషన్‌కు రాలేని బాధితుల కోసం ఈ సేవలు ఎంతో ఊరటనిస్తున్నాయి. ఈ విధానం ద్వారా ఫిర్యాదు స్వీకరించడమే కాకుండా, ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదైన వెంటనే దాని కాపీని నేరుగా బాధితుల మొబైల్‌కే పంపడం విశేషం.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జనవరి 9న ప్రారంభమైన ఈ వర్చువల్ పోలీసింగ్ వ్యవస్థ కేవలం పది రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో దాదాపు 200 మంది బాధితులకు పక్కాగా లీగల్ డ్రాఫ్ట్‌లను సిద్ధం చేసి అందించారు. దీనివల్ల బాధితులు ఫిర్యాదు రాయడానికి పడే ఇబ్బందులు తప్పడమే కాకుండా, స్టేషన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ పర్యవేక్షణ కోసం 24 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక బృందం రెండు షిఫ్టుల్లో నిరంతరాయంగా పనిచేస్తోంది.

ఫిర్యాదు చేసే సులభతర విధానం:

  • ప్రాథమిక ఫిర్యాదు: సైబర్ నేరాలకు గురైన వారు 1930 హెల్ప్‌లైన్ నంబర్ లేదా జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి.

  • AI డ్రాఫ్టింగ్: వెంటనే సీ-మిత్ర బృందం బాధితులకు కాల్ చేసి వివరాలు సేకరించి, AI సాయంతో లీగల్ డ్రాఫ్ట్‌ను వాట్సాప్ లేదా మెయిల్ ద్వారా పంపుతుంది.

  • సంతకం & పంపడం: బాధితులు ఆ కాపీపై సంతకం చేసి బషీర్‌బాగ్ సైబర్ క్రైమ్ స్టేషన్‌కు పోస్ట్ లేదా కొరియర్ చేస్తే సరిపోతుంది. ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే వివరాలు నేరుగా బాధితుడి మొబైల్‌కు అందుతాయి.