TELANGANA

రేవంత్ కొత్త సంవత్సర కానుక.. వారికి రూ.5 లక్షల ప్రమాద బీమా..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు శుభవార్త చెప్పింది. ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకాన్ని ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ పథకం అమలుతో రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు బీమా పొందనున్నారు.

 

రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో గిగ్ వర్కర్లకు బీమా కల్పిస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాన్ని కాంగ్రెస్ రాజస్థాన్ లో అధికారంలో అమలు చేసింది. అక్కడి ప్రభుత్వాలు చేపట్టిన చట్టాన్ని అధ్యయనం చేసి, వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిజిస్టరింగ్ అథారిటీ, క్లెయిమ్ రిసీవింగ్ అథారిటీని కూడా నియమిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు.

 

 

అలాగే నాలుగు నెలల క్రితం కుక్క తరిమితే భవనంపై నుంచి పడి మృతి చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ రిజ్వాన్‌ సీఎం రేవంత్ ఆదుకున్నారు. ఆ కుటుంబానికి సీఎం సహాయనిధి నుంచి రూ.2 లక్షల చెక్కును శనివారం సచివాలయంలో పంపిణీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు బీమా సౌకర్యం కల్పించింది.

 

ఇప్పటికే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం కొనసాగుతోంది. త్వరలో ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ప్రజాపాలన నిర్వహిస్తూ ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు