సోషల్ మీడియా వేదికగా తన దృష్టికి వచ్చిన సమస్యలపై తక్షణమే స్పందించే ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోసారి తన చొరవతో ఒక కుటుంబాన్ని కలిపారు. విజయవాడలో రెండు రోజుల క్రితం ఒక మహిళ తప్పిపోయిందని, ఆమెను వెతకడంలో సహాయం చేయాలని ఒక నెటిజన్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా లోకేష్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి, సదరు మహిళ ఆచూకీ కనిపెట్టాలని విజయవాడ పోలీసులను ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని, తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించి కేవలం గంటల వ్యవధిలోనే తప్పిపోయిన మహిళను గుర్తించారు. సురక్షితంగా ఆమెను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. ఈ విషయాన్ని పోలీసులు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ, సమస్యను తమ దృష్టికి తెచ్చినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల భద్రతకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు చూపిన వేగవంతమైన స్పందనపై మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. “థ్యాంక్యూ వెరీ మచ్ విజయవాడ పోలీస్” అంటూ ఆయన వారికి ధన్యవాదాలు తెలియజేశారు. లోకేష్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తున్న తీరు పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధితులకు అండగా నిలిచిన పోలీసుల పనితీరును అందరూ అభినందిస్తున్నారు.

