ఆదిలాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. బజార్‌హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి, ఓ రైతు నుంచి రూ. 2 లక్షల భారీ మొత్తాన్ని లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. సాదా బైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసేందుకు ఆయన ఈ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
బాధితుడు తన 8.35 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ తిరగగా, విద్యాసాగర్ రెడ్డి డబ్బు ఇస్తేనే పని అవుతుందని తెగేసి చెప్పారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అధికారుల వ్యూహం ప్రకారం, శుక్రవారం సాయంత్రం బాధితుడు నిందితుడికి నగదు అందజేస్తుండగా ఏసీబీ బృందం దాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది. నిందితుడి వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్న అధికారులు, కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని, వాట్సాప్ లేదా సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు. అవినీతి రహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని వారు కోరారు.

