CINEMA

అనిల్ సుంకర కొత్త సాహసం: ‘నారీ నారీ నడుమ మురారి’ తర్వాత ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’

ఈ ఏడాది సంక్రాంతికి శర్వానంద్ హీరోగా అనిల్ సుంకర నిర్మించిన ‘నారీ నారీ నడుమ మురారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ జోష్‌తో ఉన్న ఆయన, తన తదుపరి ప్రాజెక్టుగా కొత్త నటీనటులతో ఒక వినూత్న చిత్రాన్ని పట్టాలెక్కించారు. ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షో ద్వారా ఎంపికైన కొత్త టాలెంట్‌తో ఏటీవీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు.

విజయవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నలుగురు నిరుద్యోగ యువకుల కథాంశంతో తెరకెక్కుతోంది. తమ జీవితంలో ఎదురైన సంఘటనలు, లక్ష్య సాధనలో ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఆ నలుగురు యువకులు ఎలా విజయం సాధించారు అనే పాయింట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిరుద్యోగులైన యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ ‘ఎయిర్‌ఫోర్స్-బెజవాడ బ్యాచ్’ కథ ఉంటుందని చిత్ర బృందం భావిస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ కూడా చాలా వైవిధ్యంగా సాగుతున్నాయి. విజయవాడ వీధుల్లో సరదాగా బ్యానర్లు వేస్తూ.. అమెరికా వెళ్లిన తమ బ్యాచ్ మేట్ తిరిగి వస్తున్నట్లుగా క్రియేటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. సంక్రాంతికి కమర్షియల్ హిట్ కొట్టిన అనిల్ సుంకర, ఇప్పుడు ఈ ప్రయోగాత్మక చిత్రంతో మరో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.