National

ముడి చమురు రాజకీయం.. రష్యాకు భారత్ దూరం..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత్ భారీ డిస్కౌంట్లకు రష్యా ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై గతేడాది మార్చిలో భారీగా సుంకాలు విధించింది. దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థపై భారం పడటంతో, న్యూఢిల్లీ ఇప్పుడు తన చమురు దిగుమతుల వ్యూహాన్ని మార్చుకుంటోంది.

 

గత జనవరిలో రోజుకు 12 లక్షల బారెళ్లుగా ఉన్న రష్యా చమురు దిగుమతులు, ఫిబ్రవరి నాటికి 10 లక్షలకు, మార్చి నాటికి 8 లక్షల బారెళ్లకు పడిపోయే అవకాశం ఉందని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. భవిష్యత్తులో దీనిని 5 లక్షల బారెళ్లకు పరిమితం చేసి, అమెరికాతో మెరుగైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవాలని భారత్ భావిస్తోంది. ఈ లోటును పూడ్చుకోవడానికి భారత్ ఇప్పటికే మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాల నుంచి కొనుగోళ్లు పెంచింది.

 

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు బంధించిన తర్వాత, అక్కడ ఏర్పడిన కొత్త పరిస్థితుల నేపథ్యంలో వాషింగ్టన్ తన వైఖరిని మార్చుకుంది. భారత్ తిరిగి వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేసుకోవచ్చని అమెరికా సంకేతాలిచ్చింది. దీనివల్ల అటు రష్యా ఆదాయం తగ్గడంతో పాటు, భారత్‌కు చమురు సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూసినట్లవుతుందని అమెరికా ప్లాన్. భారత పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా చమురు వనరులను వైవిధ్యపరుస్తున్నట్లు పేర్కొనడం ఈ మార్పును ధృవీకరిస్తోంది.