TELANGANA

కేటీఆర్ హెచ్చరిక: “వడ్డీతో సహా చెల్లిస్తాం”.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ నేత!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టును కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్య అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని అక్రమంగా దక్కించుకోవడానికే ఈ కుట్ర పన్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదని, రాజకీయాల కోసం వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ కలిసి క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్‌కు ఉన్న మెజారిటీని దెబ్బతీయాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బాల్క సుమన్‌పై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ద్వారా మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లు పాటించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం శోచనీయమని అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన సుమన్‌ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కొంతమంది పోలీసు అధికారులపై కూడా కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని అతిక్రమించి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసే అధికారులు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. “బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. అప్పుడు ఇప్పుడు జరుగుతున్న ప్రతి అన్యాయానికి వడ్డీతో సహా సమాధానం చెప్తాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.