హైదరాబాద్ వనస్థలిపురంలో బుధవారం జరిగిన సునీత అనే గర్భిణి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన మాజీ భార్యపై కక్ష పెంచుకున్న దేవరకొండ మహేష్ అనే వ్యక్తి, ఆమెను అత్యంత కిరాతకంగా చంపేందుకు కెనడా నుంచి పక్కా ప్లాన్‌తో వచ్చాడు. గతంలో తనపై గృహహింస కేసు పెట్టి తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందని, ఆ కారణంతో తన వీసా రిజెక్ట్ అయిందని భావించిన మహేష్, ఆమెపై ప్రతీకారంతో రగిలిపోయాడు. సునీత రెండో పెళ్లి చేసుకుని గర్భిణిగా ఉందని తెలుసుకుని, ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.
సునీత ఎక్కడుందో తెలియని మహేష్‌కి, ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఆమె ఆచూకీని పట్టించింది. ఆ రీల్‌లో కనిపించిన ఒక దేవాలయం ఫోటో ఆధారంగా అది వనస్థలిపురంలోని ప్రాంతమని గుర్తించిన నిందితుడు, అక్కడ గాలించి చివరకు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను కనిపెట్టాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి సునీతను అతి క్రూరంగా నరికి చంపేశాడు. నిందితుడి బ్యాగును తనిఖీ చేసిన పోలీసులు అతను తెచ్చుకున్న వస్తువులను చూసి షాక్‌కు గురయ్యారు.
మహేష్ కేవలం కత్తితోనే కాకుండా, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఎలక్ట్రిక్ రంపాలు (Electric Saws), పెట్రోల్ డబ్బాలను తన వెంట తెచ్చుకున్నాడు. ఒకవేళ సునీత తలుపులు తీయకపోతే రంపంతో కోసైనా లోపలికి వెళ్లాలని, ఎవరైనా అడ్డు వస్తే పెట్రోల్‌తో తగలబెట్టాలని అతను వేసుకున్న పథకం చూసి పోలీసులు విస్తుపోయారు. మహిళా చట్టాలను అడ్డం పెట్టుకుని తన జీవితాన్ని నాశనం చేసిందనే ఆవేశంతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. ప్రస్తుతం మహేష్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

