CINEMA

జానపద హీరో కాంతారావు వ్యక్తిత్వంపై కుమార్తె సుశీల ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు సినీ పరిశ్రమలో ‘జానపద బ్రహ్మ’, ‘రాజకుమారుడు’గా వెలుగొందిన దివంగత నటుడు కాంతారావు గురించి ఆయన కుమార్తె సుశీల పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, తన తండ్రి కేవలం తెరపైనే కాదు, నిజ జీవితంలోనూ ఒక గొప్ప దొర అని కొనియాడారు. సొంత ఊరిలో ఆయనకు 400 ఎకరాల భూమి ఉండేదని, అప్పట్లోనే ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారని గుర్తు చేసుకున్నారు.

కాంతారావు వ్యక్తిత్వం గురించి చెబుతూ.. ఆయనకు భాషలపై ఉన్న పట్టును సుశీల వివరించారు. ఆయనకు ఉర్దూ బాగా వచ్చని, తన వ్యక్తిగత డైరీని కూడా ఉర్దూలోనే రాసేవారని తెలిపారు. అంత గొప్ప నటుడైనప్పటికీ ఆయనకు ఏమాత్రం గర్వం ఉండేది కాదని, తన కింద పనిచేసే వారిని సైతం ఎంతో గౌరవించేవారని ఆమె పేర్కొన్నారు. అయితే, అప్పట్లో అగ్ర హీరోగా పేరున్న కాంతారావు కుమార్తెగా తనకు మాత్రం ఎంతో గర్వంగా ఉండేదని ఆమె మనసులోని మాటను బయటపెట్టారు.

సినిమాల్లో కత్తిసాము చేయడంలో ఎన్టీఆర్, రాజనాల వంటి ఉద్ధండులతో సమానంగా కాంతారావు గుర్తింపు పొందారని సుశీల గుర్తు చేశారు. షూటింగ్‌లలో వాడిన భారీ బరువున్న కత్తులు చాలా కాలం తమ ఇంట్లోనే ఉండేవని చెప్పారు. తర్వాతి కాలంలో ఆయన ఆస్తులు కోల్పోయినప్పటికీ, తమ కుటుంబం ఎప్పుడూ బాధపడలేదని, కోట్లాది మంది అభిమానుల ప్రేమే ఆయన సంపాదించిన అసలైన ఆస్తిగా భావిస్తామని ఆమె గర్వంగా వెల్లడించారు.