తెలంగాణలో సారా (Sara) దుకాణాలను తిరిగి ప్రారంభించాలని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరడం రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతోంది. సోమవారం సచివాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై ‘బాంబు’ పేల్చబోతున్నానని ప్రకటించారు. గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేవారని, కానీ ప్రస్తుతం కల్తీ మద్యం తాగి 80 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన వింత వాదనను వినిపించారు.
సారా ఆరోగ్యానికి హానికరం కాదని శాస్త్రీయంగా నిరూపించబడిందని అనిరుధ్ రెడ్డి వాదించారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ‘జీరో అవర్’లో ఈ అంశాన్ని లేవనెత్తి, సారా దుకాణాలను పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవిస్తానని చెప్పారు. మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలను నడుపుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అనిరుధ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధించిన సారాను మళ్లీ ప్రోత్సహించడం సరికాదని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఎమ్మెల్యే మాత్రం తన పట్టు వీడకుండా, ఇతర రాష్ట్రాల ఎక్సైజ్ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణలో కూడా అమలు చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదం అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

