రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ పార్టీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతం చేసేందుకు మొత్తం 9 మంది పోలీసు అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ ఈ సిట్‌కు చీఫ్‌గా వ్యవహరించనున్నారు. ఈ కేసులో రాజకీయ నేతల ప్రమేయం ఉండటంతో, పకడ్బందీగా ఆధారాలను సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.
మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపిన నమిత్ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని ఉప్పర్‌పల్లి కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి వీరికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వీరిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో ఉన్న మిగిలిన ఎనిమిది మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు.
విచారణలో భాగంగా సిట్ అధికారులు మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ లైసెన్స్‌ను రద్దు చేయాలని సైబరాబాద్ సీపీకి లేఖ రాశారు. అలాగే, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆ ఫామ్‌హౌస్‌ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో కీలక నేతలు ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

