AP

ఇక‌ ప్రతి నెల 4వ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత హెల్త్ క్యాంపులు..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల ఆరోగ్యంపై కీల‌క‌ నిర్ణయాలు తీసుకున్నారు. మంగళవారం అమరావతిలోని తన క్యాంప్ కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు. మెరుగైన ప్రజారోగ్యం కోసం ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమంలా పని చేయాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇకపై ప్రతి నెలా 4వ శనివారం స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు, హెల్త్ క్యాంపులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఏప్రిల్ నెల నుండి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు నేరుగా ప్రజల్లోకి వెళ్లి ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని సూచించారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలోని కుప్పం, నారావారిపల్లెలో ప్రయోగాత్మకంగా విజయవంతమైన ఈ సంజీవని ప్రాజెక్టును, రాబోయే జూలై నాటికి రాష్ట్రమంతటా అమలు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

వచ్చే ఏడాది కాలంలో రాష్ట్రంలో సుమారు 56.40 లక్షల మందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించాలనే భారీ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈ పరీక్షల ఫలితాలను కేవలం 48 గంటల్లోనే నేరుగా ప్రజల వాట్సప్ నంబర్లకు అందించాల‌న్నారు. ఈ కార్యక్రమం కోసం 904 మొబైల్ మెడికల్ యూనిట్లు అవసరమవుతాయని, దీనికయ్యే రూ. 162 కోట్ల వ్యయానికి సీఎం తక్షణమే ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు 3.14 లక్షల మంది సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్ డేటాబేస్‌లో నమోదు చేసుకున్నారని, ప్రతి ఒక్కరి వ్యక్తిగత హెల్త్ రికార్డ్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ కావాలని ఆయన అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో వైద్య ఖర్చులు తగ్గాలంటే ప్రజలు ప్రివెంటివ్ హెల్త్ (ముందస్తు జాగ్రత్తలు) పై దృష్టి సారించాలని, యోగా, ధ్యానం, ప్రాణాయామం, సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా 80 శాతం అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని సీఎం వివరించారు.

 

రాష్ట్రంలో కొత్తగా ‘ఏపీ హెల్త్ మేనేజ్మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విధానం ప్రధానంగా ఐదు స్తంభాలపై (5 Pillars) ఆధారపడి ఉంటుంది: 1. మాతృత్వ, 2. శక్తి, 3. నైపుణ్యం, 4. క్షేమ, 5. సంజీవని. ఈ ఐదు అంశాల ద్వారా గర్భిణుల నుండి వృద్ధుల వరకు అందరికీ నాణ్యమైన వైద్యం అందేలా చూడాలన్నారు. అలాగే త్వరలో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ని అమలు చేయాలని, ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు పలు ప్రముఖ బీమా సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు. పీపీపీ (PPP) విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, ఫార్మసీ నెట్‌వర్క్ బలోపేతం, ల్యాబొరేటరీ ఇంటిగ్రేషన్ వంటి అంశాలపై అధికారులతో లోతుగా చర్చించారు.

 

రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్ ప్రసవాలపై ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితులు లేదా వైద్య బృందం తప్పనిసరి అని సూచిస్తే తప్ప, గర్భిణులకు నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఏదైనా ఆసుపత్రిలో సిజేరియన్లు 20 శాతానికి మించి జరిగితే తప్పనిసరిగా ఆడిటింగ్ నిర్వహించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖలో ఎక్కడా సిబ్బంది ఖాళీలు ఉండకూడదని, రేషనలైజేషన్ ద్వారా ఎప్పటికప్పుడు నియామకాలు జరపాలని అధికారులను ఆదేశించారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాలో ప్రజారోగ్యం ఎంత మేర మెరుగైందో క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ నివేదికను రాష్ట్రవ్యాప్త అమలుకు ప్రాతిపదికగా తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.