AP

జగన్‌పై మంత్రి అనిత సంచలన విమర్శలు..

అమరావతి రాజధాని విషయంలో గత ప్రభుత్వం అనుసరించిన తీరుపై హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేసుకున్నారు. సుమారు 1,631 రోజుల పాటు సాగిన సుదీర్ఘ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు. రైతులు నేలపైన భోజనాలు చేస్తూ ఎన్నో అవమానాలు భరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు అమరావతి రాజధానికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత కల్పించడం ప్రతి ఒక్కరికీ ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

 

కమెడియన్‌లా వ్యవహరించిన జగన్..

 

గత పాలకుల వైఖరిని ఎండగడుతూ జగన్ మోహన్ రెడ్డిపై అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై జగన్ రెడ్డి అనవసరమైన అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు సైకోలా వ్యవహరించిన వ్యక్తి ఇప్పుడు కమెడియన్‌లా మారిపోయారని ఎద్దేవా చేశారు. అమరావతి రాజధానిని మార్చడం ఇక ఎవరి వల్ల సాధ్యం కాదని ఆమె స్పష్టం చేశారు. పవిత్ర ఆలయాల నుంచి సేకరించిన జలాలు మట్టితో శంకుస్థాపన జరిగిన ఈ ప్రాంతం ఎంతో గొప్ప చరిత్ర కలిగినదని వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీలు సైతం అమరావతికి మద్దతు తెలుపుతుండటం మనందరికీ గర్వకారణమని ఆమె అన్నారు.

 

సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి..?

 

కుటుంబ సంబంధాల విషయంలోనూ జగన్ తీరును ఆమె తప్పుబట్టారు. సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వ్యక్తి చెల్లిని ఆస్తి విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఇటీవల జగన్ వాడిన ‘మావిగన్’ అనే పదంపై స్పందిస్తూ ఆయనకు గన్ కల్చర్ అలవాటు ఉందని అందుకే ఇలాంటి మాటలు వస్తున్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ మాటలను చూసి ప్రజలంతా నవ్వుకుంటున్నారని అతడిని ఒక జోకర్లా చూస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

 

ఇప్పటికైనా అమరావతికి మద్దతు ప్రకటించాలి..

 

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారని అనిత గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో విజ్ఞత కలిగిన వారని జగన్ మాటలకు ఎవరూ రెచ్చిపోరని ధీమా వ్యక్తం చేశారు. జగన్ కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా అమరావతికి మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తమదేనని ఆమె స్పష్టం చేశారు