TELANGANA

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీల‌క‌ ప్రకటన..

హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రాజెక్టు ఆమోదానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని దీని ఆమోదం అనేది అనేక సాంకేతిక, ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

 

కేంద్ర ప్రభుత్వం 2017లో ప్రవేశపెట్టిన మెట్రో రైల్ పాలసీకి అనుగుణంగా ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రతిపాదనలపై అప్రైజల్ (మదింపు) జరుగుతోందని మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు నిధుల లభ్యత, వనరుల సమీకరణ ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని వివరించారు. ముఖ్యంగా ప్రతిపాదిత రెండో దశ నెట్‌వర్క్‌ను ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొదటి దశ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేసే విషయంలో సాంకేతిక సవాళ్లు ఉన్నాయని సభ దృష్టికి తెచ్చారు. ఈ సాంకేతిక సాధ్యసాధ్యాలపై లోతైన అధ్యయనం చేసి సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా నామినేట్ చేసినట్లు తెలిపారు.

 

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మూడు రకాల ఆప్షన్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ ఆప్షన్లను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తన తుది నిర్ణయాన్ని కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాధానం, కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే ప్రాజెక్టు తదుపరి అడుగులు పడనున్నాయి. మెట్రో రెండో దశ ద్వారా నగరంలోని శివారు ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతుందని విమానాశ్రయ మార్గం సహా ఐటీ కారిడార్లలో రద్దీ తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

 

మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే భారీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం (PPP మోడల్) లేదా ఇతర ఆర్థిక వనరుల గురించి కూడా కేంద్రం ప్రస్తావించింది. ప్రస్తుతానికి ప్రతిపాదనలు ప్రాథమిక పరిశీలన దశలోనే ఉన్నాయని సాంకేతిక నివేదికలు అందిన తర్వాతే ఆర్థిక కేటాయింపులపై స్పష్టత వస్తుందని మంత్రి తోకన్ సాహూ వివరించారు. మెట్రో రెండో దశ కోసం వేచి చూస్తున్న నగరవాసులకు కేంద్రం ఇచ్చిన ఈ సమాధానంతో ప్రాజెక్టు ప్రస్తుత స్థితిపై ఒక స్పష్టత లభించింది.