రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా సర్కార్ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సర్వే నంబర్ల వారీగా డిజిటల్ సర్వే పూర్తి కాకుండా రిజిస్ట్రేషన్లు నిర్వహించకూడదని భావిస్తోంది. దీనికోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలను సమన్వయం చేస్తూ భూ భారతిలో ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భూమికి సంబంధించిన దస్తావేజులు ఉంటే ప్రాసెస్ పూర్తవుతుంది. కానీ,క్షేత్రస్థాయిలో ఆ భూమి ఉందా? సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా? అనేది రిజిస్ట్రేషన్ అధికారుల పరిధిలోకి రాదు.
అధికారులకు సవాల్‌గా..
దీని వలన ఒకే సర్వే నంబర్‌పై డబుల్ రిజిస్ట్రేషన్లు జరగడంతో వివాదాలు మొదలవుతున్నాయి. అంతేగాక ప్రభుత్వ,ప్రైవేటు భూముల మధ్య స్పష్టత లేకపోవడం, వాటిని గుర్తించేందుకు అధికారులకు సవాల్ గా మారుతున్నది. ఇరు పార్టీల మధ్య రిజిస్ట్రేషన్ల ప్రాసెస్ ముగిసిపోయిన తర్వాత వివాదాలు షురూ అవుతున్నాయి. అధికారుల రికార్డుల ప్రకారం ప్రస్తుతం సుమారు 70 శాతం కంటే ఎక్కువ కేసులు భూ వివాదాలతోనే కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నట్లు చెప్తున్నారు. దీంతోనే ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
కొత్త విధానంతో ఇలా..?
కొత్త విధానంలో సర్వే , రిజిస్ట్రేషన్ ప్రక్రియలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి.ఎవరైనా భూమిని అమ్మాలనుకున్నప్పుడు, ముందుగా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత డిజిటల్ కో ఆర్డినేట్స్ ఆధ్వర్యంలో ఆధునిక టెక్నాలజీ ద్వారా భూమి అక్షాంశాలు, రేఖాంశాలను గుర్తిస్తారు. నిర్వేశిత సర్వేయర్లు సర్వేను మానిటరింగ్ తోపాటు డిజిటల్ రికార్డ్స్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత సరిహద్దులు ఖరారైన వెంటనే ఆ వివరాలు ఇంటిగ్రేటెడ్ పోర్టల్‌లో అప్‌డేట్ అవుతాయి. పోర్టల్‌లో సర్వే డేటా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో క్రయవిక్రయాలు జరుగుతాయి. ఈ విధానంతో రిజిస్ట్రేషన్ శాఖలో గణనీయమైన మార్పులు కనిపించనున్నాయి. భూ వివాదాల కొత్త కేసులు 80 శాతం నుంచి 90 శాతం తగ్గే ఛాన్స్ ఉన్నది. డబుల్ రిజిస్ట్రేషన్లు 100 శాతం తగ్గుతాయి. కోర్టుల్లోని పెండింగ్ కేసులు కూడా క్రమంగా క్లియర్ అవుతాయని ఆఫీసర్లు తెలిపారు.
టైటిల్ గ్యారంటీ..
భూ పరిపాలన నిపుణుల విశ్లేషణ ప్రకారం కేవలం కాగితాల మీద రిజిస్ట్రేషన్ కాకుండా, క్షేత్రస్థాయి కొలతలతో రిజిస్ట్రేషన్‌ను లింక్ చేయడం వల్ల ‘టైటిల్ గ్యారెంటీ’ లభిస్తుంది. దీని వల సామాన్య రైతులకు, రియల్ ఎస్టేట్ రంగానికి మరింత భరోసా లభిస్తుందని ఎక్స్ పర్ట్స్ వివరిస్తున్నారు. మరోరవైపు సర్వే చేసిన భూమికి ఆధార్ లాంటి యూనిక్ నంబరును కేటాయించడం వలన, భూమాఫియాకు అడ్డుకట్ట పడటమే కాకుండా, రాష్ట్ర ఖజానాకు కూడా పారదర్శకమైన ఆదాయం సమకూరుతుందని వివరించారు. భూ భారతి ద్వారా రాబోతున్న ఈ మార్పులు సామాన్యుల భూమికి రక్షణ కవచంగా నిలుస్తుందని అధికారులు చెప్తున్నారు.

