National

మహిళా బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యే.. విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర ఫైర్..!

భారత రాజకీయాల్లో మహిళలకు చారిత్రక సాధికారత కల్పించేందుకు ఉద్దేశించిన ‘నారీ శక్తి వందన్’ సవరణను కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు “గర్భంలోనే చంపేశాయని” ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడంపై శనివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇది కేవలం బిల్లు ఓటమి కాదని, భారత మహిళల ఆకాంక్షలపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఈ చారిత్రక తప్పిదంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే పక్షాలదే ప్రధాన పాపమని నేరుగా ఆరోపించారు.

 

ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఈ పరిణామం తనను తీవ్రంగా బాధించిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం భ్రూణహత్యతో సమానమని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ సవరణ ఎవరి హక్కులనూ హరించడానికి కాదు. దేశ జనాభాలో సగభాగమైన మహిళలకు దశాబ్దాలుగా నిరాకరించిన హక్కులను అందించడానికే. మేం నిజాయతీతో, స్పష్టమైన ఉద్దేశంతో చేసిన ఈ పవిత్ర మహాయజ్ఞాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి” అని మోదీ అన్నారు.

 

21వ శతాబ్దంలో భారత మహిళలకు కొత్త అవకాశాలు కల్పించి, వారి పురోగతికి అడ్డంకులను తొలగించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని వివరించారు. దేశాభివృద్ధిలో మహిళలను నిజమైన భాగస్వాములుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్‌కు మహిళా రిజర్వేషన్లపై మొదటి నుంచి వ్యతిరేకతే ఉందని, గతంలో జరిగిన ప్రయత్నాలను కూడా ఆ పార్టీ అడ్డుకున్న చరిత్రను ప్రధాని గుర్తుచేశారు. “ఈసారి కూడా తప్పుడు వాదనలు, పక్కదారి పట్టించే ఎత్తుగడలతో చట్టాన్ని అడ్డుకున్నారు. ఈ చర్యలతో ఆ పార్టీలు భారత మహిళల ముందు తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నాయి. దశాబ్దాల నాటి తప్పులను సరిదిద్దుకునేందుకు వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ జారవిడుచుకుంది” అని విమర్శించారు. కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీలు మహిళలు రాజకీయంగా ఎదగడాన్ని సహించలేవని ఆరోపించారు.

 

సంస్కరణలను వ్యతిరేకించడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మోదీ విమర్శించారు. “జన్ ధన్, జీఎస్టీ, డిజిటల్ చెల్లింపులు వంటి కీలక సంస్కరణలను కాంగ్రెస్ వ్యతిరేకించింది. సైనికుల కోసం తెచ్చిన ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ను 40 ఏళ్ల పాటు అడ్డుకున్న చరిత్ర వారిది. ఉగ్రవాదం, నక్సలిజంపై ఆ పార్టీ వైఖరిని దేశం మర్చిపోదు” అని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవి అని, ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి బతుకుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

 

డీలిమిటేషన్ అంశంపై కూడా విపక్షాలు అసత్య ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించాయని మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని, పైగా అన్ని రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యం పెరుగుతుందని తాను హామీ ఇచ్చినా వినలేదన్నారు.

 

“ఈ బిల్లును అడ్డుకోవద్దని, కావాలంటే ఈ ఘనతను మీరే తీసుకోండని విపక్ష నేతలకు విజ్ఞప్తి చేసినా వారు పెడచెవిన పెట్టారు. ఇవాళ మాకు సంఖ్యాబలం తక్కువగా ఉండొచ్చు. కానీ మహిళా రిజర్వేషన్ సాధన కోసం మా పోరాటం ఆగదు. చట్టసభల్లోకి రావాలన్న మహిళల కలలను ధ్వంసం చేసిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు రాబోయే ఎన్నికల్లో దేశ మహిళలు గట్టిగా బుద్ధి చెబుతారు. వారు ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి” అని మోదీ హెచ్చరించారు. ఈ బిల్లును అడ్డుకున్న పాపం ఆ పార్టీలను జీవితాంతం వెంటాడుతుందని ఆయన వ్యాఖ్యానించారు.