TELANGANA

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఆర్టీసీ సమ్మె, కాళేశ్వరం విచారణ, ఉద్యోగుల బకాయిలు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధిపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేసింది.

 

1. ఆర్టీసీ సమ్మెపై చర్చ – చర్చలకు పిలుపు

రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై మంత్రివర్గం తీవ్రంగా చర్చించింది. కార్మికులు ఎవరూ క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని, సంయమనం పాటించాలని కేబినెట్ విజ్ఞప్తి చేసింది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని గుర్తు చేసింది. ఈ క్రమంలోనే రేపు (శుక్రవారం) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో చర్చలకు రావాలని కార్మిక సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా పిలుపునిచ్చింది. ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ , శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ రావు, జూపల్లి కృష్ణారావు ఐదుగురితో కమిటిని ఏర్పాటు చేసింది ప్ర‌భుత్వం.

 

2. కాళేశ్వరం విచారణ – సీబీఐ దర్యాప్తు వేగవంతం

కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కేబినెట్ విశ్లేషించింది. జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమని కోర్టు అంగీకరించిందని, కేవలం నోటీసుల జారీలో ఉన్న సాంకేతిక లోపాలను మాత్రమే వేలెత్తి చూపిందని పేర్కొంది. ఈ తీర్పు సీబీఐ దర్యాప్తునకు ఎలాంటి అడ్డంకి కాదని న్యాయ నిపుణులు స్పష్టం చేయడంతో, సీబీఐ విచారణను వేగవంతం చేయాలని కేంద్రాన్ని కోరాలని నిర్ణయించింది. అలాగే, సుప్రీంకోర్టుకు వెళ్లాలా అనే అంశంపై ఢిల్లీ న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిశ్చయించింది.

 

3. రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట – వంద రోజుల్లో బకాయిలు

గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో పడ్డ వేల కోట్ల రూపాయల ఉద్యోగుల బిల్లులపై కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం రిటైర్డ్ ఉద్యోగులకు రూ. 8,000 కోట్లు, రెగ్యులర్ ఉద్యోగులకు రూ. 6,200 కోట్ల బకాయిలు ఉన్నట్లు గుర్తించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ, వంద రోజుల్లోగా రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. అవసరమైతే మంత్రులు, ప్రజా ప్రతినిధుల జీతాల నుండి 50 శాతం నిధులను ఇందుకోసం సర్దుబాటు చేస్తామని కేబినెట్ ప్రకటించింది.

 

4. పీఏసీఎస్ (PACS) పాలకవర్గాల నియామకం

రాష్ట్రవ్యాప్తంగా పదవీ కాలం పూర్తయిన ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘాల (PACS) విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఈ సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో కొత్త పాలకవర్గాలను నియమించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. దీనివల్ల వ్యవసాయ రుణాల పంపిణీ, ఇతర సహకార కార్యకలాపాలు ఎక్కడా ఆగకుండా సాఫీగా సాగే అవకాశం ఉంది.

 

5. గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి – స్పోర్ట్స్ యూనివర్సిటీ

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇక్కడ అందుబాటులో ఉన్న 76 ఎకరాల్లో 21 రకాల క్రీడలకు సంబంధించిన సౌకర్యాలు కల్పిస్తారు. స్టేడియం సామర్థ్యాన్ని 50 వేలకు పెంచడంతో పాటు, ఒక అత్యాధునిక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మిగిలిన 12 ఎకరాల్లో కమర్షియల్ కార్యకలాపాలకు అనుమతినిచ్చి, తద్వారా వచ్చే ఆదాయాన్ని క్రీడాకారుల శిక్షణ, వసతి కోసం కేటాయిస్తారు.

 

6. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు – భూసేకరణకు నిధులు

మంథని నియోజకవర్గ ప్రజల చిరకాల స్వప్నమైన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 63 గ్రామాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణ సమస్యల వల్ల ఆలస్యమైన ఈ ప్రాజెక్టు కోసం మిగిలిన 1407 ఎకరాల సేకరించడానికి అవసరమైన రూ. 166.67 కోట్లను కేబినెట్ మంజూరు చేసింది. దీనివల్ల మహాదేవ్‌పూర్, కాటారం వంటి వెనుకబడిన ప్రాంతాల రైతులకు మేలు జరుగుతుంది.

 

7. మంచిర్యాలలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిసరాల్లో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ రెవెన్యూ పరిధిలోని ఇరిగేషన్ విభాగానికి చెందిన 85.10 ఎకరాల భూమిని మత్స్య శాఖకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఆక్వా పార్క్ ద్వారా చేపల పెంపకం, ప్రాసెసింగ్, ఎగుమతులకు సంబంధించి అత్యాధునిక మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.