దాదాపు నెల రోజుల తర్వాత మళ్లీ మీడియా ముందుకొచ్చారు మాజీ సీఎం జగన్. మీడియాలో హైలైట్ కావాలనే.. ఏంటో తెలీదుగానీ సీఎం చంద్రబాబుపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మావిగన్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు.
నెల రోజుల తర్వాత మీడియా ముందు జగన్
దాదాపు నెల రోజుల తర్వాత మాజీ సీఎం జగన్ మీడియా ముందుకొచ్చారు. గురువారం ఉదయం తాడేపల్లిలోని పార్టీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ సీఎం. గతంలో మాదిరిగా ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో హంగమా చేసిన ‘మావిగన్’ వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చారు జగన్.
మావిగన్ పేరు ఎత్తిన సీఎం చంద్రబాబు బీపీ పెరుగుతోందని, పొరపాటున ఎవరైనా నిద్రలో ఆయన ముందు ‘మావిగన్’ అంటే చాలని, బహుశా ఆయన గుండె ఆగి చనిపోయినా చనిపోతారని వ్యాఖ్యానించారు. అందుకే ఆ పేరు ఎత్తితే ఆయనకు బీపీ పెరుగుతోందన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైనా మీరు అడగాలని మీడియా మిత్రులకు రిక్వెస్ట్ చేశారు.
మరోసారి సీఎం చంద్రబాబు చావుపై ప్రస్తావన
ఆయన గుండె ఆగిపోకుండా ఉంటే అదృష్టమని, ఈ విషయంలో మీ మీద బ్లాస్ట్ చేయకుండా ఉంటే చాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టమన్నారు. గతంలో చంద్రబాబుపై ఈ తరహాలో వ్యాఖ్యలు చేశారు జగన్. అప్పుడు మీడియాలో పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు అదే విధంగా వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు అధికారంలో ఉండగా వైసీపీ పవర్‌లోకి రాదని భావించి అలా అన్నారా? అందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేశారా? అంటూ సోషల్ మీడియాలో చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయినా తోటి నాయకుడిపై ఆ విధంగా మాట్లాడడం మాజీ ముఖ్యమంత్రికి తగదని అంటున్నారు.
గతంలో చాలామంది రాజకీయ నేతలను చూశామని, ఏ ఒక్కరూ మరణాల గురించి కోరుకోలేదని, బహుశా అలాంటి నేత ఈయనే కావచ్చని అంటున్నారు. మొత్తానికి ఏదో మాట్లాడాలని వచ్చి మీడియాకు మరోసారి మసాలా ఇచ్చేశారు మాజీ సీఎం. ఇప్పటికే మావిగన్ విషయంలో వైసీపీ నేతలు సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. ఇప్పుడు మళ్లీ అలాంటి ఛాన్స్ ఇచ్చేశారాయన.

