AP

ప్రశ్నిస్తే జైల్లో పెడతారు..? చంద్రబాబు సర్కార్‌పై ఎస్వీ మోహన్ రెడ్డి ధ్వజం..

కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను, ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న వారిపై చంద్రబాబు నాయుడు సర్కార్ అక్రమ కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడితే చాలు.. అరాచక పాలనతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

 

కూటమి పాలనలో జర్నలిస్టులకు కూడా రక్షణ లేకుండా పోయిందని, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనుంజయ్ రెడ్డి లాంటి వారిపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ప్రశ్నించే సామాన్యులను సైతం వదలడం లేదని, వైసీపీ అధికార ప్రతినిధులు శ్యామల, కారుమూరి వెంకటరెడ్డిల పై వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. చివరికి నీట్ పరీక్ష పేపర్ లీకేజీని ప్రశ్నించిన అభిజిత్ అనే యువకుడిని కూడా వదల్లేదంటూ కేంద్రం తీరును తప్పుపట్టారు.

 

రాష్ట్రంలో విపక్ష నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ‘రెడ్ బుక్ రాజ్యాంగాన్ని’ అమలు చేస్తున్నారని ఎస్వీ మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. పోలీసులను అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ బ్రిటిష్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, సొంత పార్టీ నేత పగడాల సునీల్ ప్రశ్నిస్తేనే కాళ్లు, చేతులు విరగ్గొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు యువకుడి ఆత్మహత్యపై ప్రశ్నించిన వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులపై చూపిస్తున్న శ్రద్ధను, ఇచ్చిన హామీల అమలుపై పెట్టాలని.. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.