TELANGANA

కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ..! కవిత సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లా సమగ్ర అభివృద్ధి టీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రం, పటాన్ చెరు లో తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆమె ఎగురవేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో మాట్లాడుతూ, పటాన్ చెరు, సంగారెడ్డి లో మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలే నడుస్తున్నాయని అన్నారు.

 

కార్పొరేట్ విద్య, వైద్యం ఫ్రీ

 

అన్ని పార్టీల్లోని పెద్ద నాయకులంతా ఒకరికి ఒకరు అండగా ఉంటూ ప్రజలను ఆగం చేస్తున్నారని చెప్పారు. పటాన్ చెరు, సంగారెడ్డిలో కాలుష్యం, కరెప్షన్, మ్యాచ్ ఫిక్సింగ్ లేని రాజకీయాలు అవసరమున్నాయన్నారు. తెలంగాణ వస్తే బతుకులు మారుతాయని భావిస్తే ఇంకా ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ ప్రాంతం మీద శ్రద్ధ, ప్రేమ లేని కారణంగానే ఆ పరిస్థితి తలెత్తిందని విమర్శించారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే కార్పొరేట్ విద్య, వైద్యాన్ని కూడా ఫ్రీ గా ఇస్తామని… లేదంటే తెల్లపూర్ శాసనానికి కట్టేసి కొట్టండని అన్నారు.

 

మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు

 

సంగారెడ్డి, పటాన్ చెరు లో అన్ని పార్టీల నాయకులు ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారని కవిత మండిపడ్డారు. పార్టీలు వేరైనా లోపాయికారి ఒప్పందాలతో ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు. అన్ని విషయాలపైనా నోరు వేసుకొని పడిపోయే ఎంపీ రఘునందన్ రావు జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ రాకపోయినా ఎందుకు నోటి తాళం వేసుకున్నారని ప్రశ్నించారు. బుల్లెట్ ట్రైన్ ఇవ్వకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన బీజేపీని మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయల కారణంగానే అంతా గప్ చుప్ అయ్యారని మండిపడ్డారు.

 

బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం

 

కానీ జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు తెలంగాణ రక్షణ సేన పోరాటం చేస్తుందన్నారు. అటు ఎంఎంటీఎస్ ట్రైన్ తెస్తామంటూ నమ్మబలికి.. పేదల ఇళ్లను లాక్కొని వారిని రోడ్డున పడేశారని విమర్శించారు. ఇటు ఎంఎంటీఎస్ ట్రైన్ రాలేదు, అటు ఇళ్లు కోల్పోయిన పేదలకు సరైన పరిహారమూ అందలేదన్నారు. ఇక జిల్లాలోని ఎమ్మెల్యేల పరిస్థితి చూస్తే మరింత విచిత్రంగా ఉందన్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే అసలు ఏ పార్టీలో ఉన్నారో ఎవరికీ తెలియటం లేదని చెప్పారు. సంగారెడ్డి ఎమ్మెల్యే ఒక పార్టీ గుర్తుపై గెలిచి, మరో పార్టీ పనులకు వెళ్తూ స్వార్థ రాజకీయాలకు తెరలేపుతున్నారని విమర్శించారు.

 

వనరులు పెరగటం తప్ప ప్రజలకు ఒరిగిందేమే లేదు

 

ఆంధోల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చిందని ఈ ప్రాంత ప్రజలు సంతోషిద్దామనుకుంటే, ఆయన బావమరిది సింగూర్ ప్రాజెక్టు ఎఫ్ టీ ఎల్ పరిధిలోని దాదాపు రెండు వందల ఎకరాల భూమిని కబ్జా చేశాడని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్న ఎందుకు ఏ పార్టీ ప్రశ్నించటం లేదో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేల ఆర్థిక వనరులు పెరగటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్, కరెప్షన్, కాలుష్యం లేని రాజకీయాల అవసరం ఉందని కవిత అన్నారు.

 

ఈ ప్రాంతాన్ని ప్రేమించే పార్టీ కావాలి

 

తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ప్రజల బతుకులు మారలేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ 15 ఏళ్లుగా కుంగుతుంటే రాష్ట్రం వచ్చాక కూడా దాన్ని పట్టించుకోలేదన్నారు. ఈ ప్రాంతానికే చెందిన హరీశ్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉండి కూడా రూపాయి ఇవ్వలేదన్నారు. ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టు సాగు కావడమే కాకుండా, రాజధాని హైదరాబాద్ నగరానికి కూడా ఇక్కడి నుంచే తాగునీరు వెళ్లాల్సి ఉందన్నారు. అప్పుడు ఆంధ్రావాళ్లను తిట్టిన మనం రాష్ట్రం వచ్చాక ఎందుకు బాగు చేసుకోలేదని ప్రశ్నించారు.

 

శ్రద్ధ, ప్రేమ లేకపోవడమే ఈ పరిస్థితి

 

శ్రద్ధ, ప్రేమ లేని కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని కవిత చెప్పారు. ఈ ప్రాంతాన్ని ప్రేమించే రాజకీయ శక్తి అవసరం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లాంటి మూడు పెద్ద పార్టీలు ఉన్న తర్వాత మీ పార్టీ అవసరం ఏంటనీ చాలా మంది అడుగుతున్నారని కవిత కవిత చెప్పారు. మూడు పెద్ద పార్టీలు ఉండి కూడా పేదలు విద్య, వైద్యం కోసం జేబులు చూసుకోవాల్సిన పరిస్తితి ఎందుకు ఉందో చెప్పాలన్నారు. పిల్లలు చదువుకుంటామంటే అవకాశం కల్పించలేని పార్టీలు ఉంటే ఎంత? లేకుంటే ఎంత అని అన్నారు.

 

ఉచిత విద్య, వైద్యం ఇవ్వకపోతే రాళ్లతో కొట్టండి

 

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి రాగానే పూర్తిగా ఉచిత విద్య, వైద్యం ఇస్తామని లేదంటే తెల్లాపూర్ శాసనానికి కట్టేసి కొట్టాలని అన్నారు. ప్రజల కష్టాలను ఒక తల్లి మాదిరిగా ఆలోచిస్తేనే అర్థమవుతాయని చెప్పారు. ఒక ఆడబిడ్డగా తల్లిగా ఆలోచించే స్వభావం తనదన్నారు. ఆడబిడ్డలను నమ్ముకొని పెట్టిన పార్టీకీ వారి ఆశీస్సులు కావాలన్నారు. కల్లాల వద్ద రైతుల గుండె ఆగిపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గుండె ధైర్యం ఉన్న పార్టీలు లేని పరిస్థితి ఉందని చెప్పారు. తమ పార్టీ పాంచజన్యం అనే ఐదు కీలక అంశాలకు ప్రాధాన్యం ఇస్తుందని కవిత అన్నారు. ఉచిత విద్య, వైద్యం తో పాటు రైతులకు గౌరవంతో కూడిన జవాబుదారీ పాలన అందిస్తామన్నారు.

 

యువతకు ఏడాదిలో 4 లక్షల ఉద్యోగాలు

 

యువతకు ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారు. యువత వ్యాపారం చేసకునేందుకు 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు రుణాలు ఇస్తామని చెప్పారు. సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసేలా సామాజిక న్యాయ తెలంగాణను సాధిస్తామని చెప్పారు. తెలంగాణ వనరులను, భూమిని, అస్తిత్వాన్ని కాపాడకోవాల్సిన అవసరముందని.. ఆ పని తెలంగాణ రక్షణ చేస్తుందని కవిత అన్నారు.

 

కాలుష్యం పోవాలి

 

పటాన్ చెరు ఏషియాలోనే అతి ఇండస్ట్రీయల్ ఏరియా అని.. ఇక్కడి పరిశ్రమలను తరలలించకుండా కాలుష్యం కట్టడి చేసే చర్యలు చేపట్టాలని సూచించారు. 30 ఏళ్లుగా కాలుష్యం అరికట్టే చర్యలు చేపట్టకపోవటంతో నక్క వాగు, మంజీర నది కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. పటాన్ చెరు భూమి లో కిలోమీటర్ వరకు కాలుష్యం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో కాలుష్యం లేకుండా ప్రజలకు ఉపాధి పెరిగే అవకాశాలపై దృష్టి పెట్టాలన్నారు.

 

ఘన స్వాగతం పలికిన నాయకులు

 

టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కవితకు పటాన్ చెరు, సంగారెడ్డి పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. బతుకమ్మలు, బోనాలతో ఊరేగింపు తీశారు. సంగారెడ్డి చౌరస్తా నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ, బతుకమ్మలు, బోనాలతో సంప్రదాయబద్ధంగా మహిళలు స్వాగతం పలికారు. ఈ రెండు కార్యక్రమాల్లో స్థానిక పార్టీ నాయకత్వం, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.