కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేస్తామని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో సుమారు రూ.11,000 కోట్లకు పైగా నిధులతో ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో 125 రోజుల పనిదినాలు కల్పించి, రహదారులు, డ్రైనేజీలు, కాలువలు వంటి శాశ్వత ఆస్తుల కల్పనకు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్’ (వీబీ జీ రామ్ జీ) ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం చారిత్రాత్మకమని ఆయన అభివర్ణించారు.
గురువారం రైల్వేకోడూరు నియోజకవర్గంలోని ముక్కవారిపల్లి గ్రామంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. “గతంలో ఉపాధి హామీ పథకం (నరేగా) కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ వీబీ జీ రామ్ జీ పథకం ఇక్కడి నుంచే దేశవ్యాప్తంగా ప్రారంభం కావడం మనందరికీ గర్వకారణం. కేంద్రం రూ.7,700 కోట్లు, రాష్ట్రం రూ.4,000 కోట్లు కలిపి మొత్తం రూ.11,000 కోట్లకు పైగా నిధులతో గ్రామీణ అభివృద్ధికి బాటలు వేస్తాం. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏ పనైనా చేపట్టవచ్చు. ముఖ్యంగా పొలాలకు వెళ్లే డొంక రోడ్లను కూడా నిర్మించుకోవచ్చు. జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తాం” అని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని, జల్ జీవన్ మిషన్ సహా 93 కేంద్ర ప్రాయోజిత పథకాలను నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆరోపించారు.
“విధ్వంసమైన రాష్ట్రాన్ని నిలబెడతామని చెప్పి, కేవలం రెండేళ్లలోనే మాట నిలబెట్టుకున్నాం. ఇప్పుడు రూ.28 వేల కోట్లతో వివిధ పథకాలు చేపడుతున్నాం. గొడ్డలి పార్టీ రోజుకో మాట మాట్లాడుతోంది. ఎన్నికలకు ముందు ఒకటి, తర్వాత మరొకటి. ఇప్పుడు ‘మావిగన్’ అంటూ కొత్త పాట పాడుతున్నారు. ఇది ఎవరికైనా అర్థమైందా? అమరావతిని ఆపడం ఎవరి తరమూ కాదు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాయలసీమ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. “రాయలసీమ దేశంలోనే ఉద్యాన పంటలకు కేంద్రం. త్వరలో రూ.40 వేల కోట్ల ప్రభుత్వ, రూ.60 వేల కోట్ల ప్రైవేటు పెట్టుబడులు తెస్తాం. మదనపల్లిలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే సత్యవేడులో హీరో మోటార్స్ ఉండగా, త్వరలో తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ రాబోతోంది. పుట్టపర్తిలో ఆమ్కా ఫైటర్ జెట్ తయారీ యూనిట్, గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిలబెట్టడంతో పాటు రైల్వే జోన్ సాధించాం” అని తెలిపారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అడిగిన వెంటనే తోతాపురి మామిడి రైతుల సమస్యలు, రహదారులు, పీఎంఏవై గృహాల కోసం నిధులు కేటాయించారని, ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
“భారత మాతకు వికసిత్ భారత్, తెలుగు తల్లికి స్వర్ణాంధ్ర మా సంకల్పం. బంగారం గనులున్న జొన్నగిరి పేరును చారిత్రక స్వర్ణ గిరిగా మార్చాం. స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధన అన్ స్టాపబుల్” అని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేశ్ పాశ్వాన్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

