ఏపీలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సాయిప్రసాద్, సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు హాజరయ్యారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో సీఎస్ పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా కొత్త లోకల్ క్యాడర్ విధానానికి అనుగుణంగా పోస్టుల కేటాయింపు, రిజర్వేషన్ రోస్టర్ ఖరారు, ఖాళీల వివరాలను ఏపీపీఎస్సీతో పాటు ఇతర నియామక ఏజెన్సీలకు వెంటనే పంపడం వంటి ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండో విడత జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండో విడతలో భాగంగా సుమారు 3,168 పోస్టులను భర్తీ చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి తొలుత 3,979 పోస్టులతో క్యాలెండర్ విడుదల చేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతానికి 3,168 పోస్టులకు పరిమితం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 91 గ్రూప్-1 పోస్టులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ నియామకాలపై త్వరలోనే అధికారికంగా పూర్తి స్పష్టత రానుంది.
ఈ ఏడాది మార్చిలో ఉగాది కానుకగా మంత్రి నారా లోకేశ్ 10,060 పోస్టులతో తొలి విడత జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ క్యాలెండర్‌లోని యూనివర్సిటీ పోస్టులకు ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన పోస్టులకు కూడా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ఇకపై ప్రతీ ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రెండో విడత క్యాలెండర్‌పై ప్రభుత్వం దృష్టి సారించడం నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేపుతోంది. ఇదే సమావేశంలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతుల విషయంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణ చర్యల కేసులను ఆరు నెలల్లో పరిష్కరించాలని కూడా సీఎస్ అధికారులకు సూచించారు.

