AP

అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్… సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమీక్ష..

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక ప్రగతికి చోదక శక్తిగా, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులు, సింగపూర్ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.

 

ఈ సమావేశంలో సింగపూర్ ప్రతినిధులు అమరావతి నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడి నమూనా వంటి కీలక అంశాలను ప్రాజెక్టులో భాగంగా చేర్చినట్లు తెలిపారు.

 

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఉద్యోగాలు కల్పించడం ద్వారా అమరావతి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. అమరావతిని ఆర్థికంగా పరిపుష్టం చేసేలా ‘క్రియేటివ్ సిటీ’ నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

 

ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణంతో అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నామని సీఎం తెలిపారు. ఎల్‌నినోతో ఇబ్బందులు ఎదురైనా, పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి తరలించడంతో రాజధాని ప్రాంతం జలకళను సంతరించుకుందని గుర్తుచేశారు. గ్లోబల్ బెంచ్‌మార్కింగ్ చేరుకోవడం, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం గణనీయంగా పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

 

ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పి.నారాయణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.