TELANGANA

బీఫ్ ఆర్డర్లు, బిర్యానీలు..! ఢిల్లీ నిరసనలు రాంచందర్ రావు షాకింగ్ కామెంట్స్..!

నీట్ ప్రశ్న పత్రాల లీకేజీలో కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా కూటమి ప్రభుత్వం ఉన్న సమయంలో అనేక పేపర్ లీకేజీలు జరిగాయని, అప్పుడు ఎవరైనా రాజీనామా చేశారా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంతో కావాలనే దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రాహుల్ గాంధీ చూస్తున్నారన్నారు. జంతర్ మంతర్ నిరసనకు హైదరాబాద్ నుంచి బిర్యానీ పోతే ఇబ్బందేంలేదని, కానీ ఖతార్ నుంచి బీఫ్ వస్తుందా? అందులో ఏముస్తుందో చూసుకుని తినాలని ఆయన చురకలంటించారు. ఉద్యమంలో మఫ్టీలో బీజేపీ కార్యకర్తలు చొరబడ్డారనే సీజీపీ చేస్తున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

వెనుక ఎవరున్నారో తెలుసు..

సీజీపీ ఉద్యమం పక్కదారి పట్టడమేంటని, అసలు దానికి దారే లేదని ఎద్దేవాచేశారు. ఉద్యమాన్ని ఎవరు పక్కదారి పట్టిస్తున్నారనేది కెమెరాలు చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఇంతకు ముందు గోడలకు మాత్రమే చెవులు ఉండేవని, ఇప్పుడు గాల్లో కెమెరాలు ఉంటున్నాయనే విషయం మరిచిపోవద్దన్నారు. సీజేపీ పేరిట చలో పార్లమెంట్ వెనుక ఎవరున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, సీజేఐ చేసిన కామెంట్స్ నచ్చక సీజేఐని అవమానపరచడానికి ఒక వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడని రాంచందర్ రావు గుర్తుచేశారు. సీజేపీలో సినిమా వాళ్లు, ఆటగాళ్లు కలవడమంటే, దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడమే కొందరు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.

 

అల్లర్లు సృష్టించే కుట్ర..

జంతర్ మంతర్ లో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, కాంగ్రెస్, సీపీఐ లీడర్స్ తోనే సీజీపీ అల్లర్లు సృష్టించే కుట్ర చేస్తోందన్నారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ లో సక్సెస్ అయినట్టుగానే ఇక్కడ కూడా అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేస్తున్నారన్నారు. ఖత్తార్, కలిస్థాన్ నుంచి అల్లర్లు జంతర్ మంతర్ లో సృష్టించేవాళ్ళకు ఫుడ్ బుక్ చేస్తున్నారంటూ రాంచందర్ రావు ఆరోపించారు. వాస్తవానికి నీట్ రాసిన ఏ ఒక్క స్టూడెంట్ జంతర్ మంతర్ అల్లర్లకు సహకరించటంలేదని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి హైదరాబాద్ లో కూడా ఇలాంటి విచ్ఛిన శక్తులు ప్రవేశించాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉండగా బీజేపీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి మృతిపై రాంచందర్ రావు సంతాపం వ్యక్తం చేశారు.