పోటీ ప్రపంచంలో సింగరేణి క్యాలరీస్ సంస్థను సమర్థవంతంగా నిర్వహిస్తూ, వ్యాపార విస్తరణ ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షితంగా అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సింగరేణి తెలంగాణకు ఆత్మలాంటిదని, కార్మికులు, ప్రజలతో 130 ఏళ్ల చరిత్రకలిగిన సింగరేణితో భావోద్వేగ అనుబంధం ఉందని బట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవడమే కాకుండా, రాబోయే తరాలకు లాభదాయకంగా అందించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు. సత్తుపల్లిలోని సింగరేణి ఒపెన్ కాస్ట్ బొగ్గుగనిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం పరిశీలించారు. గనిలో బొగ్గు లభ్యత, పరిమాణం, బొగ్గు క్వాలటీని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మైనింగ్ నిర్వహణలో పాటిస్తున్న పద్ధతులు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యక్షంగా చూడటానికే క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చినట్లు చెప్పారు.
వారి దృష్టిలో రెండూ ఒక్కటే..
ఓవర్ బర్డెన్ అనేది మైనింగ్ లో బయటకు తీసే మట్టి, రాతి వ్యర్థం, బొగ్గు అనేది సింగరేణికి ప్రధాన రాబడి తెచ్చే అత్యంత విలువైన వనరుగా ఆయన చెప్పారు. కాంట్రాక్టర్లకు ఓబీ తీసినా, బొగ్గు తీసినా వాల్యూమ్ ప్రకారమే బిల్లులు వస్తాయి కాబట్టి వారి దృష్టిలో రెండూ ఒక్కటే అనిపించవచ్చన్నారు. సింగరేణి యాజమాన్యానికి మాత్రం ఓవర్ బర్డెన్, బొగ్గు మధ్య ఉన్న వ్యత్యాసం చాలా స్పష్టంగా తెలిసి ఉండాలని భట్టి సూచించారు. ఫేస్ వద్ద బ్లాస్టింగ్ జరిపి, లోడింగ్ చేసే సమయంలో బొగ్గులో ఓవర్ బర్డెన్ మట్టి, రాళ్ళు కలవకుండా చూడాలన్నారు. ప్రతీ షావల్ దగ్గర, ప్రతీ లోడింగ్ పాయింట్ దగ్గర మన అధికారులు ఉండి కంటిన్యూయస్ మానిటరింగ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి సూచించారు. నాణ్యత లేని బొగ్గును రవాణా చేయడం వల్ల అనవసరమైన ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడమే కాకుండా, థర్మల్ పవర్ ప్లాంట్లలో ప్రొడక్షన్ తగ్గిపోయి ట్రిప్ అవుతాయని అన్నారు.
కొత్త కోల్ బ్లాక్స్..
కల్తీ లేని నాణ్యమైన బొగ్గును మాత్రమే జెన్ కోకు, ఇతర కస్టమర్లకు సరఫరా చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఒకప్పుడు బొగ్గు రంగంలో ఏకఛత్రాధిపత్యం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. మార్కెట్‌లో ప్రైవేట్ సంస్థలు పోటీకి వస్తున్నాయని, విదేశాల నుంచి ‘ఇంపోర్టెడ్ కోల్’ వస్తోందన్నారు. ఈ కాంపిటీటివ్ మార్కెట్ లో సింగరేణి నిలబడాలంటే అత్యంత నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయలని స్పష్టంచేశారు. పదేళ్ల కాలంలో కొత్త కోల్ బ్లాక్స్ వేలంలో సింగరేణి పాల్గొనకపోవడం వల్ల చాలా అవకాశాలను కోల్పోయామని భట్టి మండిపడ్డారు. ఒక కోల్ బ్లాక్ వేలంలో దక్కించుకుని, అక్కడ భూసేకరణ, అటవీ అనుమతులు సాధించి మైనింగ్ ప్రారంభించడానికి కనీసం 7 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుందన్నారు.
ప్రపంచం మొత్తం..
ఈ నేపథ్యంలో సింగరేణి కనీసం 10 ఏళ్ల ముందస్తు ప్రణాళికతో పని చేయాలని ఆదేశించారు. దీనిపై సింగరేణి యాజమాన్యం-జెన్ కో యాజమాన్యం కలిసి కూర్చుని ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిచర్ల-2, నైని వంటి బ్లాక్‌లకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, ఫారెస్ట్ అనుమతుల సమస్యలను వేగంగా పరిష్కరించామని భట్టి వెల్లడించారు. ప్రపంచం మొత్తం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తోందని, సింగరేణి కూడా కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సోలార్ ఎనర్జీ రంగంలోకి వేగంగా అడుగులు వేయాలన్నారు.
మైనింగ్ రంగంలో..
భవిష్యత్తులో థర్మల్ పవర్‌కు ప్రత్యామ్నాయంగా సోలార్, పంప్డ్ స్టోరేజ్, హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ వాడకం పెరుగుతుందని అన్నారు. దీనికి అనుగుణంగా సింగరేణి సోలార్ పవర్ ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. మైనింగ్ రంగంలో సింగరేణి సంస్థకున్న అపారమైన అనుభవం, నిపుణులైన సాంకేతిక శక్తి కేవలం బొగ్గుకే పరిమితం కాకూడదన్నారు. సెమీకండక్టర్లు, చిప్ తయారీకి అవసరమైన క్రిటికల్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణ, మైనింగ్ ప్రక్రియలోకి సింగరేణి ప్రవేశించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి భట్టి వెంట ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, జెన్ కో సీఎండీ హరీష్, సింగరేణి డైరెక్టర్ గౌతమ్ పోట్రూ, ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్ రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

