TELANGANA

తెలంగాణ సాధనలో జయశంకర్ సార్ పాత్ర మరువలేనిది: హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కేసీఆర్ పోరాటం, జయశంకర్ సార్ ఆరాటం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తాలో జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం హరీశ్ రావు మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమంలో ఎప్పుడూ పాల్గొనని వ్యక్తి ప్రస్తుతం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏనాడూ ‘జై తెలంగాణ’ అనలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ప్రాజెక్టులకు సంబంధించి ఒక్క అనుమతి కూడా తీసుకురాలేకపోయిందని హరీశ్ రావు విమర్శించారు. గతంలో జీఆర్ఎంబీ సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరాలు వచ్చినా అప్పటి ప్రభుత్వం వాటిని ఎదుర్కొని అనుమతులు సాధించిందని తెలిపారు. ప్రస్తుతం గతంలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను కూడా రివ్యూ చేయాలనే అంశాన్ని అజెండాలో చేర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి జీఆర్ఎంబీ అజెండాను మార్చాలని, అవసరమైతే సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.