వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో పార్టీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశంపై నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు.
విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపై జరిగిన దాడి దురదృష్టకరమని బొత్స పేర్కొన్నారు. టెంట్లను ధ్వంసం చేయడంతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు జరిగాయని ఆరోపించారు. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు బాధితులపైనే చర్యలు తీసుకున్నారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని బొత్స ఆరోపించారు. డీఎస్సీ నియామకాలపై ప్రభుత్వం సమాధానం చెప్పకుండా నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తమ పోరాటం కొనసాగుతుందని, డీఎస్సీ అంశంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

