AP

కర్నూలులో ఉద్రిక్తత.. గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబానికి టీడీపీ నేతల పరామర్శ

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో దాడిలో తీవ్రంగా గాయపడిన శేఖర్ యాదవ్ కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు. టీడీపీ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బాలాజీ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి, ఆయన అనుచరులపై తీవ్ర ఆరోపణలు చేశారు. యాదవ కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ ఘటనకు రాజకీయ కక్షలే కారణమని ఆరోపిస్తూ, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతోందని టీడీపీ నేతలు అన్నారు. దీనిని జీర్ణించుకోలేక వైసీపీకి చెందిన కొందరు అల్లరి మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటామని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.