దేశంలో అతిపెద్ద జీవిత బీమా సంస్థ LICలో కేంద్ర ప్రభుత్వం తన వాటాలో కొంత భాగాన్ని విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తం 6.5 శాతం వరకు వాటాను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ వాటా తగ్గడంతో పాటు మార్కెట్‌లో ప్రజల వాటా పెరగనుంది. దీంతో పాలసీదారులు, పెట్టుబడిదారులపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే చర్చ మొదలైంది.
ప్రభుత్వం LICలో వాటాను ఎందుకు విక్రయించాల్సి వస్తోందంటే.. స్టాక్ మార్కెట్‌లో లిస్టెడ్ కంపెనీల్లో కనీసం 25 శాతం వాటా ప్రజల చేతుల్లో ఉండాలని మార్కెట్ నియంత్రణ సంస్థ SEBI నిబంధనలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం LICలో ప్రజల వాటా సుమారు 3.5 శాతం మాత్రమే ఉంది. ఈ వాటాను 25 శాతానికి పెంచేందుకు SEBI నిర్దేశించిన గడువు 2027 మే వరకు ఉంది. దీంతో ఆ గడువులోపు ప్రభుత్వ వాటాలో కొంత భాగాన్ని విక్రయించి పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను పెంచాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాటా విక్రయం జరిగినంత మాత్రాన సాధారణ పాలసీదారుల బీమా పాలసీలపై నేరుగా ప్రభావం పడే అవకాశం ఉండదు. పాలసీ ప్రయోజనాలు, క్లెయిమ్‌లకు సంబంధించిన నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి. మరోవైపు పెట్టుబడిదారుల పరంగా చూస్తే మార్కెట్‌లో LIC షేర్ల లభ్యత పెరగడం వల్ల ట్రేడింగ్‌లో మార్పులు రావచ్చు. అయితే షేర్ ధరపై ప్రభావం విక్రయించే వాటా పరిమాణం, ధర, మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల స్పందన వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

