తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు న్యాయపరంగా కీలక ఊరట లభించింది. ఆయన సతీమణి సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో చెంగల్పట్టులోని కుటుంబ సంక్షేమ కోర్టులో కొనసాగుతున్న కేసుకు తాత్కాలికంగా తెరపడింది. దీంతో ఈ కేసును న్యాయస్థానం అధికారికంగా ముగిస్తున్నట్లు ప్రకటించింది.
2025 డిసెంబర్ 5న సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా జరిగిన విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరు కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు.
సంగీత నిర్ణయంపై విజయ్ తరఫు న్యాయవాదులు కూడా ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో న్యాయస్థానం కేసును అధికారికంగా క్లోజ్ చేసింది. ఈ పరిణామంతో గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారిన ఈ కుటుంబ వివాదానికి ప్రస్తుతానికి ముగింపు పలికినట్లైంది.

