World

Donald Trump: బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ మరో కీలక నిర్ణయం.. రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు!

అమెరికాలో పుట్టుకతో వచ్చే పౌరసత్వం (Birthright Citizenship), బర్త్ టూరిజంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కఠిన వైఖరి ప్రదర్శించారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దురదృష్టకరమని అభివర్ణించిన ట్రంప్.. ప్రస్తుత నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ రెండు కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేసినట్లు సమాచారం. గతంలో అమెరికా పౌరులు కానివారికి అమెరికాలో పుట్టే పిల్లలకు పౌరసత్వాన్ని పరిమితం చేసే ప్రయత్నం చేసిన ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

అమెరికా భూభాగంలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కును 14వ రాజ్యాంగ సవరణ కల్పిస్తోందని పేర్కొంటూ సుప్రీంకోర్టు గతంలో ట్రంప్ ప్రయత్నాన్ని అడ్డుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తీసుకొచ్చిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ విదేశీ శత్రువులు, ఉగ్రవాద సంస్థల సభ్యులు, విదేశీ ప్రభుత్వాల తరఫున పనిచేసే లాబీయిస్టులకు సంబంధించిన పిల్లల పౌరసత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ విధానాల వ్యూహకర్త స్టీఫెన్ మిల్లర్ తెలిపారు.

ఇక రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్ టూరిజంపై మరింత కఠిన చర్యలకు సంబంధించినదిగా తెలుస్తోంది. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనివ్వడం ద్వారా పౌరసత్వం పొందే ఉద్దేశంతో వీసా తీసుకునే విధానాన్ని అమెరికా చట్టాలు ఇప్పటికే నిషేధిస్తున్నాయని మిల్లర్ తెలిపారు. తాజాగా తీసుకొచ్చిన ఉత్తర్వు ద్వారా బర్త్ టూరిజంపై అమలులో ఉన్న నిబంధనలను మరింత పటిష్టం చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయాలు అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానంపై మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి.