అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ఒకవైపు తెరవెనుక అమెరికాతో చర్చలకు ప్రయత్నిస్తూ, మరోవైపు బహిరంగంగా మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని చెబుతోందని ఆయన ఆరోపించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే లేదా ఆ దేశం పూర్తిగా లొంగిపోకపోతే, తమ అనుమతి లేకుండా ఎలాంటి సరఫరాలు ఇరాన్‌కు చేరవని ట్రంప్ హెచ్చరించారు.
తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో సోమవారం చేసిన పోస్టులో ట్రంప్ ఇరాన్ నాయకత్వం ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమెరికాతో సమావేశం కావాలని ఇరాన్ కోరుకుంటోందని, చర్చలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, సమీప భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అయితే బహిరంగంగా మాత్రం అమెరికాతో ఎలాంటి చర్చలు జరపడం లేదని ఇరాన్ ప్రకటిస్తోందని విమర్శించారు.
ఇరాన్ అణు కార్యక్రమం, హోర్ముజ్ జలసంధిపై కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ట్రంప్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ప్రాంతీయ మధ్యవర్తుల ద్వారా దౌత్యపరమైన చర్చలకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు పశ్చిమాసియా రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.

