దేశవ్యాప్తంగా E20 పెట్రోల్‌పై చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతోందని, ఇంజిన్‌లోని కొన్ని భాగాలపై ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇథనాల్ మిశ్రమ ఇంధనానికి ప్రత్యేక ధర నిర్ణయించాలని, సాధారణ పెట్రోల్‌కు ప్రత్యామ్నాయాలను అందుబాటులో ఉంచాలని కొన్ని సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే E20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం పెట్రోల్ ధరలను తగ్గించడం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం E20 విధానం ప్రధాన లక్ష్యాలని పేర్కొంది. ఇథనాల్‌ను దేశీయంగా ఉత్పత్తి చేయడం ద్వారా దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని కొంతవరకు తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల్లో తరచుగా హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయ ఇంధన అవసరాల్లో ప్రత్యామ్నాయ వనరుల వాటాను పెంచడం ద్వారా ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం చెబుతోంది. అందువల్ల E20 పెట్రోల్ విధానం ధరల తగ్గింపుకంటే దేశ ఇంధన భద్రత, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించిందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

