TELANGANA

నిమ్స్‌లో 1000 రోబోటిక్ సర్జరీలు.. దేశంలోనే కొత్త రికార్డ్..!

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్య రంగంలో అరుదైన మైలురాయిని అధిగమించింది. మూడేళ్ల కంటే తక్కువ వ్యవధిలోనే 1000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. దేశంలోని ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో ఇదొక నూతన రికార్డు అని, సామాన్యులకు సైతం అత్యాధునిక రోబోటిక్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ప్రభుత్వం పేర్కొంది.

ఈ అద్భుత ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్, యూరాలజీ అండ్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ రాహుల్ దేవరాజ్‌తో పాటు యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియాలజీ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బందిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (నిమ్స్ పాలకమండలి అధ్యక్షుడు) ప్రత్యేకంగా అభినందించారు.

మొత్తం 1000 శస్త్రచికిత్సలలో యూరాలజీ విభాగం 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ 248, సర్జికల్ ఆంకాలజీ 162 సర్జరీలు నిర్వహించాయి. వీటిలో 90 శాతానికి పైగా ఆపరేషన్లను ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) పథకాల ద్వారా ఉచితంగా అందించడం గమనార్హం. రాడికల్ ప్రోస్టేటెక్టమీ, రాడికల్ సిస్టెక్టమీ, క్లిష్టమైన రోబోటిక్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది.

రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల కచ్చితత్వం మెరుగుపడుతుందని, శస్త్రచికిత్స అనంతరం నొప్పి, రక్తస్రావం తగ్గడంతో పాటు రోగులు వేగంగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. సామాన్య పౌరులకు అత్యుత్తమ వైద్య సేవలను చేరువ చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొంటూ నిమ్స్ బృందాన్ని ప్రశంసించారు.